ట్రంప్ సర్కార్ తాజా నిషేదాజ్ఞలు!

March 21, 2017
img

ఎనిమిది దేశాల నుంచి అమెరికాకు వచ్చే నాన్-స్టాప్ విమాన సర్వీసులు, వాటిలో తీసుకువచ్చే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలపై ట్రంప్ సర్కార్ తాత్కాలికంగా నిషేధం విధించబోతున్నట్లు సమాచారం. ఈజిప్టులోని కైరో, జోర్డాన్ లోని అమ్మాన్, కువైట్, మొరాకోలోని కాసాబ్లాంకా, ఖతార్ లోని దోహా, సౌదీ అరేబియాలోని జెడ్డా మరియు రియాద్, టర్కీలోని ఇస్తాన్ బుల్, యూ.ఏ.ఈ.లోని దుబాయ్ విమానాశ్రయాల నుంచి అమెరికాలోని వివిధ నగరాలకు ‘నాన్-స్టాప్ ఫ్లైట్స్’ పై తాత్కాలికంగా నిషేధం విదించబోతున్నట్లు ఒక అమెరికన్ ఉన్నతాధికారి చెప్పినట్లు సమాచారం. ఈ తాజా నిషేధం వలన ఆ దేశాల నుంచి అమెరికాకు నాన్-స్టాప్ సర్వీసులు నడుపుతున్న 9 విమాన సంస్థలపై ప్రభావం పడనుంది. ఈ నిషేధం సంగతి సంబధిత దేశాలకు, విమాన సంస్థలకు కూడా తెలియజేసినట్లు ఆ అధికారి తెలిపారు.

అలాగే ల్యాప్ టాప్స్, ఐ-ప్యాడ్స్, కెమెరాలు మొదలైన అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను అమెరికాలోకి తీసుకురాకుండా నిషేధం విదించబోతున్నట్లు ఆ అధికారి తెలిపారు. అయితే ఈ నిషేధానికి కారణాలు తనకు తెలియవని తెలిపారు. జోర్డాన్ కు చెందిన రాయల్ జోర్డానియన్ ఎయిర్ లైన్స్ సంస్థ, సౌదీఅరేబియా అధికారిక న్యూస్ ఏజన్సీ ఈ వార్తను దృవీకరిస్తూ ప్రకటన విడుదల చేశాయి. 

అమెరికా నేతృత్వంలో బుదవారం నుంచి వాషింగ్టన్ లో అరబ్ దేశాల ప్రతినిధుల సమావేశం జరుగనుంది. ఐసిస్ ఉగ్రవాద సంస్థను అణచివేయడం గురించి దానిలో చర్చించబోతున్నట్లు సమాచారం. కానీ ఆ సమావేశానికి, ఈ నిషేధానికి లంకె పెట్టి చూడలేమని సదరు అధికారి అన్నారు. వేరే ఇతర కారణాలు ఏమైనా ఉండవచ్చని అన్నారు. ట్రంప్ సర్కార్ దీనిపై అధికారిక ప్రకటన చేస్తేగానీ స్పష్టత రాదు.  


Related Post