ఇండో-అమెరికన్ విద్యార్ధులకు ‘జూనియర్ నోబుల్ ప్రైజ్’

March 17, 2017
img

అమెరికాలో ‘జూనియర్ నోబుల్’ పేరిట జరిగే సైన్స్ పోటీలలో భారత సంతతికి చెందిన ఇంద్రాణీ దాస్ (17) మొదటి బహుమతిగా $ 2,50,000 (సుమారు రూ.1.63 కోట్లు) అందుకొంది. గాయాలు లేదా ఇతర కారణాల చేత మెదడులో నాడీ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు, ప్రాణహాని కలిగిస్తున్న ఆస్ట్రోగ్లియోసిస్ పనితీరుపై ఆమె చేసిన అధ్యయనానికిగాను ఆమెకు ఈ ప్రతిష్టాత్మకమైన జూనియర్ నోబుల్ అవార్డు, నగదు బహుమతి లభించింది. మొత్తం 1700 మంది విద్యార్ధి, విద్యార్ధినులు పాల్గొన్న ఈ సైన్స్ పోటీలో 40 మంది విద్యార్ధులు ఎంపిక అయ్యారు. వారిలో ఇంద్రాణీ దాస్ తో సహా 13మంది భారత సంతతికి చెందిన విద్యార్ధులు కావడం విశేషం. వారు వివిధ రంగాలలో పరిశోధనలు చేసి అపూర్వమైన ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డులు, నగదు బహుమతులు అందుకొన్నారు.

వారిలో అర్చన వర్మ అనే విద్యార్ధిని సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేసే కిటికీల రూపకల్పన చేసినందుకు 5వ స్థానం సాధించి $90,000 నగదు బహుమతి అందుకొంది. ప్రతీక్ నాయుడు అనే విద్యార్ధి మానవ జన్యువులు, కేన్సర్ వ్యాధిపై చేసిన అధ్యయనానికి (7వ స్థానం) $70,000 అందుకొన్నాడు. మలేరియా జ్వర నివారణ కోసం ఉపయోగిస్తున్న మందులపై పరిశోధనలు చేసిన వ్రిందా మదన అనే విద్యార్ధిని (9వ స్థానం) $50000 నగదు బహుమతి అందుకొంది. వీరందరూ భవిష్యత్ లో గొప్ప సైంటిస్టులుగా ఎదిగి యావత్ ప్రపంచానికి మేలు కలిగించే ఆవిష్కరణలు చేస్తారని ఆశిద్దాం. మై తెలంగాణా.కామ్ ఈ విద్యార్ధులు అందరికీ భారత్ తరపున అభినందనలు తెలియజేస్తోంది.  

Related Post