అమెరికాలో మరో భారతీయుడిపై కాల్పులు

March 05, 2017
img

అమెరికాలో భారతీయులనే లక్ష్యంగా చేసుకొని జాత్యాహంకారులు వరుసగా దాడులు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితమే గుజరాత్ కు చెందిన హర్నీష్ పటేల్ అనే భారతీయుడిని దక్షిణ కరోలినాలోని లాంకాస్టర్‌ అనే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మళ్ళీ శుక్రవారం రాత్రి వాషింగ్ టన్ లోని కెంట్ అనే ప్రాంతంలో దీప రాయ్ (39) అనే పంజాబీ వ్యక్తిపై ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. 

దీప్ రాయ్ కెంట్ లో తన ఇంటి ముందు కారును శుభ్రం చేసుకొంటుండగా, ముసుగు ధరించిన ఒక అమెరికన్ వచ్చి “ఇక్కడ ఉండటానికి వీలు లేదు తక్షణం మీ దేశం వెళ్ళిపోమని హెచ్చరించగా, దీప్ రాయ్ అతనితో వాదించినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కొద్దిసేపు వాదించుకొన్న తరువాత ఆ ముసుగువ్యక్తి దీప్ రాయ్ పై కాల్పులు జరిపి పారిపోయాడు. అదృష్టవశాత్తు ఆ కాల్పులలో దీప రాయ్ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం కలుగలేదు కానీ చేతికి గాయం అయింది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుపై కూడా ఎఫ్.బి.ఐ. దర్యాప్తు మొదలుపెట్టింది. 

ఈ సంఘటనపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, “అమెరికన్ సిటిజన్ షిప్ కలిగిన దీప్ రాయ్ పై కాల్పులు జరగడం చాలా దురదృష్టకరం. నేను అతని తండ్రి సర్దార్ హర్పాల్ సింగ్ తో మాట్లాడాను. ఈ దాడిలో తన కొడుకు చేతికి గాయం అయ్యిందని, ప్రాణాపాయం ఏమీ లేదని ఆయన చెప్పారు,” అని ట్వీట్ చేశారు. 

Related Post