అమెరికాలో మరో భారతీయుడి హత్య

March 04, 2017
img

అమెరికాలో మరో భారతీయుడు హత్య చేయబడ్డాడు. గుజరాత్ కు చెందిన హర్నీష్ పటేల్ దక్షిణ కరోలినాలోని లాంకాస్టర్‌ అనే ప్రాంతంలో ఒక షాపును నడుపుతున్నారు. గురువారం రాత్రి తన షాపును మూసి ఇంటికి చేరుకొంటున్న సమయంలో అయన ఇంటి ముందే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరుపడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయారు. లాంకాస్టర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలిస్తున్నారు. 

హర్నేష్ పటేల్ అక్కడ తన కుటుంబంతో కలిసి చాలా కాలంగా నివాసం ఉంటూ అక్కడే వ్యాపారం చేసుకొంటున్నారు. ఆయన భార్య, ఒక చిన్న పాప ఉన్నారు. ఆ ప్రాంతంలో అందరితో ఆయన చాలా స్నేహంగా ఉంటారని, ఎవరితో ఆయనకు ఎటువంటి శత్రుత్వం లేదని స్థానికులు చెప్పారు. ఆయన మృతి పట్ల అందరూ దిగ్బ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. 

భారతీయ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖండించిన రెండు రోజులకే ఈ హత్య జరుగడంతో ట్రంప్ హితోక్తులు జాత్యాహంకారులు చెవికెక్కలేదని స్పష్టం అయ్యింది. అయితే ఇది విద్వేషం చేసినదా లేక దొంగతనం, దోపిడీవంటి ప్రయత్నంలో జరిగినదా అనేది ఇంకా తెలియవలసి ఉంది. 

ఇప్పటికే శ్రీనివాస్ కూచిభొట్ల హత్యతో అమెరికాలోని ప్రవాసభారతీయులు, స్వదేశంలో వారి కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు. హర్నీష్ పటేల్ హత్య వారి ఆందోళనను ఇంకా పెంచడం ఖాయం. ఇంత తక్కువవ్యవధిలో వరుసగా ప్రవాస భారతీయులపైనే దాడులు జరుగుతుండటం చాలా ఆందోళనకరమైన విషయమే. భారత్ మరియు అమెరికా ప్రభుత్వాలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. 

Related Post