కాన్సాస్ ఘటనపై ట్రంప్ ఏమ్మన్నారంటే..

March 01, 2017
img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా నిన్న అమెరికన్ కాంగ్రెస్ సభలో మాట్లాడారు. ఆ సందర్భంగా, “అమెరికాలో జాతి వివక్ష, విద్వేషం, హింసకి తావు లేదు. కొన్ని రోజుల క్రితం యూదులపై జరిగిన దాడులను, ఇటీవల కాన్సాస్ లో జరిగిన దాడులను ఖండిస్తున్నాను,” అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. 

కానీ ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియా విమర్శల బాధపడలేకనే ఈ ఘటనను ట్రంప్ ఖండించినట్లుంది తప్ప నిజంగా అందుకు బాధ పడుతున్నట్లు లేదు. విద్వేషానికి తావు లేదని చెపుతూనే అమెరికా, మెక్సికో దేశాల మద్య త్వరలోనే గోడ నిర్మాణ పనులు మొదలుపెడతామని, అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకు మాత్రమే దక్కాలని చెప్పడం గమనిస్తే, కాన్సాస్ దాడి తరువాత కూడా తన వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని అర్ధం అవుతుంది. 

ట్రంప్ చెపుతున్న ఈ ఒక్క మాట కారణంగానే అమెరికాలో విదేశీయులపై దాడులు జరుగుతున్నాయి. కూచిభొట్ల శ్రీనివాస్ ను హత్య చేసే ముందు ఆడం పూరింటన్ పలికిన మాటలు ట్రంప్ నోటి నుంచి వెలువడినవే. వాటినే ట్రంప్ మళ్ళీ నిన్న కాంగ్రెస్ లో పునరుద్ఘాటించారు. అంటే ఆయనలో ఎటువంటి అపరాధభావం కానీ, వైఖరిలో మార్పు కానీ లేదని స్పష్టం అయ్యింది. 

శ్రీనివాస్ మృతికి అమెరికన్ కాంగ్రెస్ రెండు నిముషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది. కానీ ఇంతటితో ఈ దాడులు ఆగిపోతాయా? అమెరికన్ ప్రజలలో ట్రంప్ రగిల్చిన జాతి విద్వేషం సమసిపోతుందా? అంటే కాదనే అర్ధం అవుతుంది. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచి అందరినీ ఏకత్రాటిపై నడిపిస్తూ దేశంలో శాంతి, అభివృద్ధి సాధించవలసిన దేశాధ్యక్షుడే ఈవిధంగా మాట్లాడుతున్నప్పుడు ఇక ఆడం పూరింటన్ వంటి సామాన్యులు వేరేగా ప్రవర్తిస్తారని ఆశించలేము. 

అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ ఆలోచనను అందరూ సమర్ధిస్తారు. హెచ్ 1-బి వీసాల జారీలో ఆంక్షలను కూడా ఎవరూ తప్పు పట్టలేరు. కానీ అమెరికా ఫస్ట్ విధానాన్ని అమలుచేయడం కోసం ప్రజల మద్య చిచ్చు రగిలించడాన్ని ఎవరూ ఆమోదించలేరు. తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని ట్రంప్ మళ్ళీ నిన్న మరోమారు స్పష్టం చేశారు కనుక మున్ముందు దాని విషపరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఎవరూ ఊహించలేరు.

Related Post