కూచిబొట్ల అంత్యక్రియలు పూర్తయ్యాయి

February 28, 2017
img

అమెరికాలో ఒక దుండగుడి చేతిలో హత్య చేయబడ్డ కూచిబొట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ లో ముగిశాయి. శ్రీనివాస్ ను ఇంతకు ముందు ఎన్నడూ చూడనివారు కూడా అనేక వందల మంది నిన్న మల్లంపేటలోని అతని నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. ఇక అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలే కాకుండా కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ వంటి వారు కూడా శ్రీనివాస్ తల్లితండ్రులను ఓదార్చి వెళ్ళారు. 

అతిసామాన్యమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాస్ చాలా చిన్న వయసులోనే అమెరికా వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో స్థిరపడ్డాడనుకొంటే, అంత చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడని అతనిని ఎరిగిన బంధుమిత్రులు చాలా బాధపడుతున్నారు. అతని భార్య సునయన అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ ట్రంప్ ప్రభుత్వం స్పందించనే లేదు. కానీ హిల్లరీ క్లింటన్ స్పందించి ఇప్పటికైనా ఈ జాతి విద్వేషాన్ని మానుకోమని ట్రంప్ కు సున్నితంగా హెచ్చరించారు. 

శ్రీనివాస్ మృతితో అతని భార్య నిండు జీవితం చిద్రం అయిపోయింది. చెట్టంత కొడుకును పోగొట్టుకొన్న అతని తల్లితండ్రులకు ఇక బ్రతికి ఉన్నంతవరకు ఈ శోకం భరించక తప్పదు. ఒక ఉన్మాద స్థితిలో ఉన్న పూరింటన్ చేసిన పనికి ఇంతమంది జీవితాలు అల్లకల్లోలం అయితే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలకు ఎన్ని వేలు లక్షలమంది జీవితాలు అల్లకల్లోలం కానున్నాయో ఏమో? శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని, డోనాల్డ్ ట్రంప్ కు మంచి బుద్ధి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధించడం కంటే మనం ఏమి చేయగలం? 

Related Post