ప్రవాస భారతీయులకి రక్షణ కల్పించండి: జగన్

February 27, 2017
img

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఈరోజు ఒక లేఖ వ్రాశారు. అమెరికాలో జరుగుతున్న విషాదకర పరిణామాల దృష్ట్యా ఆ దేశంలో ఉంటున్న ప్రవాస భారతీయులందరికి భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవలసిందిగా ఆ లేఖ ద్వారా అభ్యర్ధించారు. ప్రవాసభారతీయులు భారత ఆర్ధిక, పారిశ్రామిక, విద్యా, వైద్య అనేక రంగాలలో అభివృద్ధి కోసం తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు కనుక వారిని ఆదుకోవలసిన భాద్యత మనపై ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. వీలైతే ప్రధాని నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్ కలిసి అమెరికా పర్యటించి డోనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి ప్రవాస భారతీయుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. అమెరికాలో సుమారు 32 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు కనుక వారి ప్రజా ప్రతినిధుల ద్వారా కూడా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగితే, ఇటువంటి దాడులు కొంత అదుపులోకి వచ్చే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రయత్నాలలో కేంద్రప్రభుత్వానికి తమ పార్టీ అన్ని విధాల మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉందని జగన్ లేఖలో హామీ ఇచ్చారు. 

శ్రీనివాస్ కూచిభొట్ల హత్య, తదనంతరం కూడా జరుగుతున్న దాడులను చూస్తున్న వారి కుటుంబ సభ్యులే కాకుండా యావత్ భారతీయులు కూడా ప్రవాస భారతీయుల యోగక్షేమాల గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. అందుకు జగన్ లేఖ ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే అమెరికా అధ్యక్షుడే విదేశీయుల పట్ల చులకనగా, అనుచితంగా మాట్లాడుతుంటే, ఆయనను ఎన్నుకొన్న సగటు అమెరికన్లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని ఆశించలేము. కనుక జగన్ చెప్పినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం అవసరమే. అదే సమయంలో ప్రవాస భారతీయులు తమ జాగ్రత్తలో తాము ఉండటం ఇంకా ముఖ్యం. ఈ విషయంలో తానా వంటి తెలుగు సంస్థలు చేస్తున్న సూచనలను అందరూ విధిగా పాటించడం చాలా మంచిది.  

Related Post