అమెరికాలో మరో భారతీయ కుటుంబంపై దాడి

February 27, 2017
img

అమెరికన్ జాత్యాహంకారం మళ్ళీ బుసలు కొట్టింది. ఈసారి దక్షిణ కొలరాడోలో పీటన్ నగరంలో నివాసం ఉంటున్న ఒక భారతీయ కుటుంబంపై దాడి జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఈసారి ఎవరూ గాయపడలేదు. తన పేరు, వివరాలు చెప్పడానికి ఇష్టపడని ఒక భారతీయుడి ఇంటిపై, బయట పార్క్ చేసిన కారుపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిన్న కోడిగుడ్లు, అశుద్ధం విసిరి “గోధుమరంగు చర్మం ఉన్నవారు, ఇండియన్లు అమెరికాలో ఉండటానికి వీలులేదు. తక్షణమే వెళ్ళిపోవాలి,” అని హెచ్చరిస్తూ చాలా పోస్టర్లు కూడా అంటించారు. ఈ సంఘటనతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. కొంతమంది ఈవిధంగా తమ విద్వేషాన్ని వెళ్ళగ్రక్కుతుంటే, మరోపక్క ఆ వీధిలో ఉండే అమెరికన్లు వచ్చి సదరు భారతీయ కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా వారి ఇంటిని, కారును శుభ్రపరచడంలో సాయం చేయడం విశేషం. 

యధారాజ తధాప్రజా అన్నట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్న విద్వేషం కారణంగానే కొంతమంది అమెరికన్లు కూడా భారతీయులపై విద్వేషం ప్రదర్శిస్తూ ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారని అర్ధం అవుతోంది. కానీ ఈ దాడులకి ట్రంప్ నిర్ణయాలకి ఎటువంటి సంబంధమూ లేదని మొన్న వైట్ హౌస్ ప్రకటించడం విశేషం. 

ఆడం పూరింటన్ అనే శ్వేతజాతీయుడు చేతిలో మృతి చెందిన కూచిబొట్ల శ్రీనివాస్ మృతదేహం ఈరోజు హైదరాబాద్ చేరుకోబోతోంది. 

Related Post