శ్వేతజాతి ఉన్మాదానికి బలైన శ్రీనివాస్

February 25, 2017
img

అమెరికాలో శ్వేతజాతి ఉన్మాదానికి మరొక భారతీయుడు బలైయ్యాడు. హైదరాబాద్ కు చెందిన కూచిబొట్ల శ్రీనివాస్, అతని స్నేహితుడు మేడసాని అలోక్ రెడ్డిలపై ఆడం పూరింటన్ అనే శ్వేతజాతీయుడు కాల్పులు జరుపగా శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలోక్ రెడ్డి, వారిని కాపాడేందుకు ముందుకు వచ్చిన ఇయాన్‌ గ్రిలట్‌ అనే ఒక అమెరికన్ పౌరుడు ఈ కాల్పులలో గాయపడ్డారు. అలోక్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు కానీ వారిని రక్షించడానికి ప్రయత్నించిన ఇయాన్‌ గ్రిలట్‌ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతను ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కానీ అతని ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. 

కూచిబొట్ల శ్రీనివాస్, మేడసాని అలోక్ రెడ్డి ఇద్దరూ కాన్సాస్ రాష్ట్రంలో గార్నిమ్‌ అనే సంస్థలో పనిచేస్తున్నారు. వారిద్దరూ తరచూ ఓలతే లోని ఆస్టిన్ బార్ కు వెళుతుంటారు. బుధవారం రాత్రి కూడా అలాగే వెళ్ళారు. వారిని చూడగానే బార్ లో ఉన్న ఆడం పూరింటన్ ఆగ్రహంతో ఊగిపోతూ, “మీరు మా ఉద్యోగాలను దోచుకొంటున్నారు. మీ వల్లే మాకు ఉద్యోగాలు దొరకడం లేదు. మీ కంటే అమెరికన్లే మేధావులు. మీ అవసరం మాకు లేదు. తక్షణమే అమెరికా విడిచిపోండి,” అని అరిచాడు. 

అతని గురించి బార్ యజమానికి వారిరువురూ పిర్యాదు చేయడంతో అతను ఆడం పూరింటన్ ను హెచ్చరించి బయటకు పంపించివేశాడు. కానీ మళ్ళీ కొద్దిసేపటి తరువాత తుపాకీతో వచ్చి శ్రీనివాస్, అలోక్ రెడ్డిలపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఆ కాల్పులలో శ్రీనివాస్ మరణించగా అలోక్ రెడ్డి, ఇయాన్‌ గ్రిలట్‌ గాయపడ్డారు. కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ఆడం పూరింటన్ ను కనుగొని అరెస్ట్ చేశారు. 

ఈ సంఘటనతో శ్రీనివాస్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే స్పందించి శ్రీనివాస్ శవాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సరిగ్గా వారం రోజుల క్రితమే వరంగల్ కు చెందిన మామిడాల వంశీ రెడ్డిని ఒక దుండగుడు కాల్చి చంపాడు. 

Related Post