హెచ్1-బి వీసాల గురించి మోడీ ఏమన్నారంటే..

February 22, 2017
img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టగానే హెచ్1-బి వీసాలపై ఆంక్షలు విదించారు. ఈ నేపధ్యంలో భారత్ పర్యటనకు వచ్చిన 26 మంది అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధులు నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు,  అమెరికా ఆర్దికవ్యవస్థను బలోపేతం చేయడంలో భారత్ ఐటి కంపెనీలు, నిపుణులు చాలా కీలకపాత్ర వహించారని కనుక హెచ్1-బి వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కాస్త దూరదృష్టితో అలోచించి సముచిత నిర్ణయాలు తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. భారత్-అమెరికాల మద్య సంబంధాలు ఎప్పుడూ బలంగానే ఉన్నాయని, ఇక ముందు కూడా ఇలాగే నిలిచి ఉండాలని కోరుకొంటున్నామని మోడీ చెప్పారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వారితో మాట్లాడుతూ, హెచ్1-బి వీసాల జారీ విషయంలో పూర్తి పారదర్శకత, స్పష్టత ఉండాలని కోరారు. ఉద్యోగాలలో అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వాలనే డోనాల్డ్ ట్రంప్ ఆలోచనను భారత్ కూడా సమర్ధిస్తుందని, అయితే దాని వలన రెండు దేశాలు నష్టపోకుండా అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఆమె సూచించారు.   

హెచ్1-బి వీసాలపై తాజా ఆంక్షల వలన భారత్ ఐటి సంస్థలు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కానీ భారత్ కు ఇటువంటి పెను సవాళ్ళు ఎదురైనా ప్రతీసారి దేశీయంగానే వాటికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు కనుగొని వాటిని అధిగమిస్తుంటుంది. భారత్ అణుపరీక్షలు జరిపినందుకు అగ్రరాజ్యాలు ఇస్రోకు సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడానికి నిరాకరిస్తే, భారత్ (ఇస్రో) దానినే ఒక అవకాశంగా మలుచుకొని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అద్భుతాలు చేస్తుండటమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 

కనుక భారత ఐటికి అమెరికా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తే, ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు భారత్ తప్పకుండా ప్రత్యామ్నాయం కనుగొనడం తధ్యం. భారతీయులు ఎల్లప్పుడూ కష్టాలు, సవాళ్ళ మద్యనే జీవిస్తుంటారు. కనుక ఈ క్కొట్ట కష్టాన్ని ఎదుర్కోవడం వారికేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు. త్వరలోనే ఈ సమస్య నుంచి బయటపడగలరు. కానీ ఇప్పటికిప్పుడు అమెరికన్లని ఉద్యోగాలలో తీసుకొని వారికి బారీగా జీతాలు ఈయలంటే అమెరికన్ సంస్థలకి కూడా కష్టమే. దాని వలన అవి కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కనుకనే కాస్త దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని ప్రధాని నరేంద్ర మోడీ సూచిస్తున్నారు. కానీఈ హితోక్తులు డోనాల్డ్ ట్రంప్ వింటారా?  

Related Post