గ్రీన్ కార్డ్ కావాలా?

February 17, 2017
img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దేశానికి వస్తున్న వారిపై, ఆ దేశంలో స్థిరపడిన విదేశీయులపై అనేక ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అది సరిపోదన్నట్లుగా ఈబి-5 వీసా విధానాన్ని అమలుచేస్తూ ట్రంప్ ప్రభుత్వం పొమ్మనకుండా  పొగపెడుతోంది.

అమెరికాలోనే స్థిరపడాలనుకొంటున్నవారికి గ్రీన్ కార్డు తప్పనిసరి. అది కావాలనుకొనేవారి కోసం ఈబి-5 వీసా విధానంలో రెండు రకాల చెల్లింపులను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా గ్రీన్ కార్డ్ పొందడం చాలా సులువే గానీ దానికి వారు చెల్లించవలసిన మూల్యం చాలా బారీగా ఉంది. 

మొదటి పద్దతిలో అమెరికాలో గ్రామీణ ప్రాంతాలలో ఏదైనా ఒక పరిశ్రమ స్థాపన కోసం ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారు రూ.6.8 కోట్లు అవుతుంది. కనుక అది పెద్ద సంస్థలకే సాధ్యం అవుతుంది. 

ఇంకా రెండోపద్దతిలో అమెరికా ప్రభుత్వం ఆమోదం పొందిన ఏదైనా ఒక సంస్థలో కనీసం 500,000 డాలర్లు పెట్టుబడిగా పెట్టాలి. అంటే సుమారుగా రూ. 3.4 కోట్లు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ రెండు పద్దతులలో ఏవిధంగా పెట్టుబడులు పెట్టినా ఆ సంస్థలలో కనీసం 10 మంది అమెరికన్ పౌరులకు శాశ్విత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ పెట్టుబడులు పెట్టిన సంస్థల ఫండ్ వాల్యూ పడిపోయిన కారణంగా 10 మంది అమెరికన్ పౌరులకు శాశ్విత ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితులు ఏర్పడినట్లయితే గ్రీన్ కార్డు వెనక్కు తీసుకోబడుతుంది.

ఈ రెండు పద్దతులలో సదరు పెట్టుబడిదారుకి, ఆ వ్యక్తి కుటుంబంలో 21సం.ల కంటే తక్కువ వయసున్నవారికి గ్రీన్ కార్డ్ మంజూరు చేస్తారు. రెండో పద్దతిలో పెట్టిన పెట్టుబడిని 5 ఏళ్ళు తరువాత వెనక్కి తీసుకొనే వెసులుబాటు ఉంటుంది.

ఈ ఈబి-5 వీసా విధానానికి గడువు ఏప్రిల్ 2017 గా నిర్ణయించడంతో, దానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంతవరకు 210 మంది దరఖాస్తు చేసుకొన్నారని వారిలో 42 మంది భారతీయులు ఉన్నారని సమాచారం. ఇక రిలయన్స్, ఆదిత్య బిర్లా వంటి భారతీయ సంస్థలు ఈబి-5 వీసా విధానం ద్వారా గ్రీన్ కార్డులు తీసుకోవడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. 

ఒక ఐటి నిపుణుడు లేదా ఒక వైద్యునిపుణుడు అమెరికాలో అనేక ఏళ్ళు కష్టపడి తన కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం దాచుకొన్న డబంతా ట్రంప్ ప్రభుత్వం ఈవిధంగా వెనక్కు తీసుకొనే ప్రయత్నం చేయాలనుకోవడం చాలా దుర్మార్గపు ఆలోచనే అని చెప్పకతప్పదు. తీరా ఉన్నందంతా ఊడ్చిపెట్టి గ్రీన్ కార్డు సంపాదించుకొన్నా ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని చోట్ల వివక్ష ఎదుర్కోక తప్పదు. కనుక ప్రవాసభారతీయులకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితిని ట్రంప్ ప్రభుత్వం కల్పించి పొమ్మనకుండానే పొగ పెడుతున్నట్లు చెప్పవచ్చు.    

Related Post