అమెరికాలో ట్రంప్ సంక్షోభం

February 08, 2017
img

ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ ప్రభుత్వం విదించిన ‘ట్రావల్ బ్యాన్’ ను వ్యతిరేకిస్తూ అమెరికాలో 16 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ట్రంప్ వేసిన పిటిషన్లపై మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కోలోని 9వ యూఎస్ అప్పీలేట్స్ కోర్టులో సుమారు గంటసేపు విచారణ జరిగింది. ఆ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ రిచర్డ్ క్లిప్టన్ “ఇది మత ప్రాతిపదికన విధించిన నిషేధమే కదా? దీని కారణంగా ప్రపంచ జనాభాలో 15శాతం ఉన్న ముస్లింలపై ప్రభావం చూపదా?” అని ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాదిని నిలదీయడం విశేషం. ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న తరువాత, ఈ కేసుకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరలోనే తమ తీర్పును వెలువరిస్తామని చెప్పి ఈ కేసును వాయిదా వేశారు. 

ఒకవేళ అప్పీలేట్ కోర్టు కూడా ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లయితే, అప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళుతుంది. దానిదే తుది నిర్ణయం అవుతుంది. ఒకవేళ అది ట్రంప్ నిర్ణయాన్ని సమర్ధిస్తే పరువాలేదు లేకుంటే ట్రంప్ కు అది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అప్పుడు ఆయన కాంగ్రెస్ (పార్లమెంటు)ను ఆశ్రయించి దాని సహకారంతో (పొందగలిగితే) చట్టం చేయవలసి ఉంటుంది. లేకుంటే మళ్ళీ మరోసారి అవమానం తప్పదు.

డోనాల్డ్ ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్ష పదవి చేపట్టారు. కానీ నెలరోజులు కూడా గడువక మునుపే దేశంలో ఇంత సంక్షోభం సృష్టించుకొన్నారు. అమెరికా చరిత్రలో అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఇన్ని ఎదురుదెబ్బలు, ఇంత తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న అధ్యక్షులు మరెవరూ లేరనే చెప్పవచ్చు. 

Related Post