బాబోయ్ ట్రంపు..

February 04, 2017
img

పొమ్మని చెప్పలేకపోతే పొగపెట్టాలిట! అది చాలా పాత కాలం పద్ధతి. నిర్ధాక్షిణ్యంగా మెడ పట్టుకొని బయటకు గెంటేయడమే కరెంట్ ట్రెండ్. దానినే ట్రంప్ సర్కార్ ఫాలో అయిపోతోందిప్పుడు. ఇంతకాలం అమెరికా అభివృద్ధి కోసం కృషి చేసిన లక్షలాది విదేశీయులందరినీ వదిలించుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ట్రంప్ సర్కార్ ఉపయోగించుకొంటోంది. అమెరికాలో ఒక ప్రముఖ పత్రిక ఫాక్స్-4లో వచ్చిన ఈ వార్తను చూస్తే అది అర్ధం అవుతుంది. 

గృహ హింస, లేదా అనుమతి లేకుండా ఆయుధాలు  కలిగి ఉండటం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడటం లేదా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటం, షాపింగ్ మాల్స్ లో దొంగతనాలు లేదా గొడవలు వంటి ఎటువంటి నేరాలకి పాల్పడినా వారిని గుర్తించి పంపించి వేసేందుకు ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. వారు ఎప్పుడైనా విచారణ కోసం ఇంటికి రావచ్చు లేదా విదేశీయులు పని చేస్తున్న కార్యాలయాలకు రావచ్చు. నేరారోపణ రుజువైన పక్షంలో దేశం నుంచి పంపించేస్తారు. ఇది గ్రీన్ కార్డ్ కలిగిన విదేశీ పౌరులతో సహా అమెరికాలో ఉంటున్న విదేశీయులందరికీ వర్తింపజేయబోతున్నారు.

ఎవరిపైనైనా నేరారోపణ చేయడం ఎంత సులువో అందరికీ తెలుసు. ట్రంప్ తన దేశంలో విదేశీయులను బయటకు పంపించివేయడానికే ఈ సులువైన మార్గం ఎంచుకొన్నారని అర్ధం అవుతూనే ఉంది. ఇటువంటి నిర్ణయాలతో అమెరికా అంతటా ఇప్పుడు ఒక రకమైన యుద్దవాతావరణం, విదేశీయులలో తీవ్ర అభద్రతాభావం నెలకొని ఉంది. అనేక మంది నేతలు, పెద్ద పెద్ద సంస్థల సిఈఓలు, లక్షలాది మంది ప్రజలు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ముందుకే సాగుతున్నారు. చివరికి ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ట్రంప్ నిర్ణయాలను చూస్తున్నవారు అందరూ ఆయనకు ఓటు వేసి గెలిపించి కొరివితో తల గోక్కొన్నామని బాధపడే పరిస్థితి కల్పిస్తున్నారు.   


Related Post