అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుతో యావత్ ప్రపంచ దేశాలలో ప్రకంపనాలు మొదలయ్యాయి. హెచ్ 1-బి వీసాల విషయంలో ఆయన తీసుకొన్న తాజా నిర్ణయంతో భారత్ ఐటి సంస్థల షేర్లు పడిపోతున్నాయి. హెచ్ 1-బి వీసా పొందాలంటే ఉద్యోగుల కనీస వార్షిక వేతనం ఒక లక్షా ముప్పై వేల డాలర్లు ఉండాలని కొత్త చట్టంలో నిబందన విదించారు. అది ప్రస్తుత డాలరు విలువ ప్రకారం భారత కరెన్సీలో సుమారు రూ.88 లక్షలకు పైనే అవుతుంది. సాధారణంగా ఐటి నిపుణులకి అంత బారీ జీతాలు ఉండవు. అంతకంటే చాలా ఉన్నతస్థాయి ఉద్యోగాలకే అంత జీతం చెల్లించబడుతుంది. కనుక అమెరికా ప్రభుత్వం పొమ్మనకుండానే అందరికీ పొగ పెడుతున్నట్లే చెప్పవచ్చు.
ఈ కారణంగా ఇక నుంచి భారత్ తో సహా అన్ని దేశాల నుంచి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళడం కష్టమే. అలాగే అమెరికాలో ఐటి లేదా వేరే కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను రప్పించుకోలేవు. అమెరికాలో ఉన్న విప్రో, టాటా వంటి భారతీయ సంస్థలకు భారత్ నుంచి ఉద్యోగులను పంపడం కష్టమే. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందనే విషయంపై త్వరలోనే స్పష్టత రావచ్చు. అమెరికాలో అన్ని సంస్థలు అమెరికన్లకు తప్పనిసరిగా ఉద్యోగాలు ఇచ్చి తీరాలని కొత్త చట్టంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కనుక ట్రంప్ విసిరిన ఈ సరికొత్త సవాలును భారతీయ సంస్థలు తట్టుకొని ఏవిధంగా నిలబడతాయో చూడాలి. ట్రంప్ ప్రకటించిన ఈ తాజా నిర్ణయాలతో భారత ఐటి కంపెనీల షేర్లు దెబ్బ తింటుతున్నాయి. అదేవిధంగా ట్రంప్ నిర్ణయాలతో భారత్ ఆర్ధిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది.
భారత ఐటి సంస్థలు చాలా అతిగా అమెరికా మీద ఆధారపడటం వలననే ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారిందని చెప్పవచ్చు. ఇంతకాలం అవి అమెరికా నుంచి బాగానే సంపాదించుకొన్నాయి కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. కనుక భారత్ ఐటి కంపెనీలు, అలాగే భారత ప్రభుత్వమూ కూడా అత్యవసరంగా ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు కనుగొనవలసి ఉంటుంది.