ట్రంప్ గారూ...ఏమిటా దూకుడు?

January 28, 2017
img

డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో ఏమేమి చెప్పారో అమెరికా అధ్యక్షుడుగా భాద్యతలు చేపట్టిన వెంటనే అవన్నీ అమలుచేయడం మొదలుపెట్టారు. అన్నిటికంటే ముందుగా హెచ్ 1-బి వీసాలు, తరువాత అమెరికన్ కంపెనీలలో అమెరికన్లకే ఉద్యోగాలు, ఒబామా హెల్త్ కేర్, అమెరికా-మెక్సికోల మద్య గోడ నిర్మాణం కోసం మెక్సికో ఉత్పత్తులపై 20 శాతం పన్ను విధింపు ఇలా శరవేగంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. తాజాగా 7 ముస్లిం దేశాల నుంచి శరణార్ధులను అమెరికాలో ప్రవేశించకుండా 30 రోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు నిన్న ట్రంప్ ప్రకటించారు. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న శరణార్ధులను దేశంలోకి అనుమతించే చట్టంపై 4 నెలలు స్టే విదించబడింది. 

నిషేదానికి గురైన దేశాలలో ఇరాన్, ఇరాక్, సిరియా, సూడాన్, లిబియా, సోమాలియా మరియు యెమెన్ ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీఅరేబియా దేశాల నుంచి వచ్చే వారి పట్ల ఇక నుంచి మరింత కటినంగా వ్యవహరించాలని నిర్ణయించుకొన్నారు. ఆయా దేశాల ప్రభుత్వాలు అందించే సమాచారం ఆధారంగా ఆ దేశాల ప్రజలను అమెరికాలోకి అనుమతించాలా వద్దా? అనేది నిర్ణయిస్తారు. అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత నిన్న దేశ ప్రధాన రక్షణ కేంద్ర కార్యాలయం పెంటాగన్ కి వెళ్ళినప్పుడు సంబంధిత ఫైల్ పై ట్రంప్ సంతకం చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మా దేశానికి, మా ప్రజల భద్రతకు భంగం కలిగించే ఇస్లామిక్ ఉగ్రవాదులను మా దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించుకొన్నాము. మా సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎవరితో అయితే పోరాడుతున్నారో వాళ్ళని మాదేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించాము. మా దేశాన్ని, మా అమెరికన్ ప్రజలని ప్రేమించేవారికే ఇక్కడ చోటు ఉంటుంది. ఆనాడు 9/11 చేదు అనుభవాలను, దానిలో బలైన మా ప్రజలు, సైనికులను మేము ఎన్నటికీ మరిచిపోలేము. కేవలం మాటలలో వారిని గౌరవించడమే కాకుండా చేతలలో కూడా దానిని చూపిస్తున్నాము,” అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.

Related Post