ట్విట్టర్ పొరపాటు..ట్రంప్ అదృష్టం

January 23, 2017
img

సాధారణంగా పొరపాట్లు జరిగితే ఎవరో ఒకరు నష్టపోతుంటారు. కానీ ట్విట్టర్ చేసిన ఒక పొరపాటు వలన డోనాల్డ్ ట్రంప్ కి అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా 13 మిలియన్ల మంది ఫాలోవర్లను తెచ్చి పెట్టింది. అమెరికా అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నవారికి @ పోటస్ (@POTUS) ట్విట్టర్ అధికారిక ఖాతగా ఉంటుంది. అధ్యక్షుడు మారినప్పుడు అది కొత్త అధ్యక్షుడుకి అప్పగించబడుతుంటుంది. గతంలో బారక్ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు దానికి 13 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. వారందరూ ఒబామా అభిమానించేవారే తప్ప డోనాల్డ్ ట్రంప్ ను కాదు. ఆ @ పోటస్ ఖాతాను ట్విట్టర్ సంస్థ యధాతధంగా నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ కు బదిలీ చేయడంతో వారందరూ తమ ప్రమేయం లేకుండానే ఆయనను ట్విట్టర్ లో ఫాలో చేస్తున్నట్లు అయిపోయింది. దానితో ట్విట్టర్ లో డోనాల్డ్ ట్రంప్ ను ఫాలో అవుతున్నవారి సంఖ్య కొన్ని గంటల వ్యవధిలోనే అనూహ్యంగా పెరిగిపోయింది. 

తమ ప్రమేయం లేకుండానే తమను డోనాల్డ్ ట్రంప్ అభిమానులుగా మార్చేసినందుకు @ పోటస్ ఫాలో అవుతున్నవారందరూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ట్విట్టర్  సి.ఈ.ఓ. జాక్ డోర్సి వారికి క్షమాపణలు చెప్పారు. ఒక సాంకేతిక తప్పిదం వలన ఆవిధంగా జరిగిందని దానిని వెంటంటే సరిచేస్తామని హామీ ఇచ్చారు.

Related Post