అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ రేపు అంటే శుక్రవారం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కనుక రేపటి నుంచి అమెరికా దేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆయన దేశాధ్యక్షుడుగా భాద్యతలు చేపట్టడం గొప్ప విశేషయమేమీ కాదు కానీ ప్రతీ విషయంలోను ఆయన చాలా వివాదస్పదంగా వ్యవహరిస్తుంటారు కనుక అమెరికా చరిత్రలో ఎవరూ ఊహించలేని ఒక కొత్త అధ్యాయం డోనాల్డ్ ట్రంప్ సృష్టించవచ్చు.
ఇతర దేశాలలో మాదిరిగా ఆ దేశ అధ్యక్షుడి ప్రభావం కేవలం ఆ దేశానికి మాత్రమే పరిమితం కాదని అందరికీ తెలుసు. కనుక ప్రపంచ దేశాల మీద డోనాల్డ్ ట్రంప్ ప్రభావం తప్పకుండా కనిపించవచ్చు. ఆయన ఇప్పటికే దేశంలో జాతీయ మీడియాను, కొన్నివర్గాల ప్రజలను దూరం చేసుకొన్నారు. అలాగే చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, కొన్ని గల్ఫ్ దేశాలు ఆయన వైఖరి పట్ల వ్యతిరేకంగానే ఉన్నాయి. ముఖ్యంగా హెచ్-1 బి వీసాల విషయంలో ఆయన కటినంగా వ్యవహరించబోతునందుకు భారత్ తో సహా అనేక దేశాలు ఆయన పట్ల గుర్రుగా ఉన్నాయి. కానీ ఇంతవరకు చైనా తప్ప ఏ దేశమూ బయటపడలేదు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టక మునుపే ఇంత తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకొన్నవారు బహుశః ఎవరూ లేరేమో?
రేపు అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన అమెరికాను ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్ళబోతున్నారు? ప్రపంచ దేశాలపై ఆయన ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఉగ్రవాదుల ఏరివేతలో ఆయన ఏవిధంగా వ్యవహరించబోతున్నారు? అమెరికా, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలపై ఆయన ప్రభావం ఏవిధంగా ఉండబోతోంది? అని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా తమతో ఆయన ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించబోతోందని భారత్, పాకిస్తాన్ దేశాలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
అమెరికా కాలమాన ప్రకారం రేపు మధ్యాహ్నం సుమారు 12గంటల తరువాత డోనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ 45వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్‌ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
డోనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణ స్వీకార ప్రక్రియలో కూడా తన ప్రత్యేకతను చాటుకొబోతున్నారు. ఆయన 9వ ఏట తల్లి బహుమానంగా ఇచ్చిన బైబిల్, దానితోబాటే అలనాడు అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్ (లింకన్ బైబిల్) రెంటిపై చెయ్యి ఉంచి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన మైక్ పెన్స్ అలనాడు రోనాల్డ్ రీగన్ ఉపయోగించిన బైబిల్ పై చేతిని ఉంచి ప్రమాణ స్వీకారం చేస్తారు.