పూణేలో ట్రంప్ దుఖాణం బంద్?

January 06, 2017
img

అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ కి భారత్ తో సహా ప్రపంచంలో 20 దేశాలలో వ్యాపారాలు ఉన్నాయి. వాటిలో పూణేలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఒకటి. పూణేకు చెందిన పంచ్ శీల్ రియాల్టీ అనే సంస్థ అక్కడ కళ్యాణీ నగర్ వద్ద 2014లో విలాసవంతమైన 23 అంతస్తుల భవనం ఒకటి నిర్మించింది. దానిని చూసి ముగ్ధుడైన డోనాల్డ్ ట్రంప్, తమ ట్రంప్ టవర్స్ సంస్థ దానితో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తుందని ప్రకటించారు. అయితే ఆ భవనంలో ఒక్కో ఫ్లాట్ ధర రూ.20 కోట్లు ఉండటంతో వాటిని కొనేవారు కరువయ్యారు. ఆ ప్రాజెక్టు వలన రెండు సంస్థలు నష్టపోవడంతో మళ్ళీ ఆ స్థాయిలో నిర్మాణాల జోలికి వెళ్ళడం లేదు. ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్షుడుగా భాద్యతలు స్వీకరించబోతున్నందున తన వ్యాపార లావాదేవీలన్నిటినీ తన పిల్లలకు అప్పగించేస్తున్నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఆయన అటార్నీగా నియమితులైన అలన్ గార్టెన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ భారత్, అర్జెంటైనాలతో సహా కొన్ని దేశాలలో తమ వ్యాపారలావాదేవీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనపై పంచ్ శీల్ రియాల్టీ చైర్మన్ అతుల్ చోడియా స్పందిస్తూ, కళ్యాణీ నగర్ ప్రాజెక్టు తరువాత ట్రంప్ టవర్స్ తమతో తదుపరి వ్యాపారాలకు ముందుకు రాలేదని, కనుక ఇప్పుడు కొత్తగా మూసివేయడానికి ఏమీ లేదని అన్నారు. ఇదివరకు ఆయన తమతో కలిసి వ్యాపారం చేసినందున ఆయన అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైనప్పుడు అభినందించడానికి అమెరికా వెళ్ళి ఆయనను కలిసి వచ్చామని, కానీ అప్పుడు కూడా మళ్ళీ కొత్త వ్యాపారాల గురించి తాము మాట్లాడుకోలేదని చెప్పారు. 


Related Post