ఎన్ఆర్ఐలకు కేసీఆర్ విజ్ఞప్తి

January 02, 2017
img

విదేశాలలో స్థిరపడిన తెలంగాణావాసులందరూ రాష్ట్రంలో తమ తమ గ్రామాలను దత్తత తీసుకని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రవాస తెలంగాణావాసులు ముందుకు వచ్చినట్లయితే వారికి ప్రభుత్వం అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తుందని అన్నారు. ఆవిధంగా వారు కూడా రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేస్తున్న కృషి కారణంగా ఈ ఏడాది 21 శాతం గ్రోత్ రేట్ సాధించగలిగామని దానిని బట్టి రాష్ట్రం సరైన దిశలోనే పయనిస్తున్నట్లు అర్ధం అవుతోందని కేసీఆర్ అన్నారు. ప్రవాస తెలంగాణావాసులు కూడా ముందుకు వచ్చినట్లయితే మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు.  

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ప్రవాస తెలంగాణావాసులు కూడా సహాయసహకారాలు అందించారు. వారు ఇంకా అందించడానికి సిద్దంగా కూడా ఉన్నారు. అయితే వారికి, ప్రజలకి మద్య సరైన వారధి లేకపోవడం వలన ఎన్ఆర్ఐలు ఎవరికి తోచినట్లుగా వారు తమ తమ గ్రామాలకు, అక్కడి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు తాము పుట్టిపెరిగిన ఊరు, అక్కడి ప్రజలపై అవ్యాజ్యమైన మమకారంతో ఏదో చేయాలని తహతహలాడుతుంటారు. వారి ఆ సెంటిమెంటుని బలహీనతగా భావించి వీలైనంత సొమ్ము రాబట్టుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందిస్తున్న సహాయసహకారాలను కొంతమంది స్వార్ధపరులు దుర్వినియోగం చేస్తుండటంతో ఎన్ఆర్ఐల మనసు విరిగిపోతుంటుంది. ఎక్కడో ఉన్నవారికి తాము ఇస్తున్న డబ్బుతో నిజంగానే అర్హులకు చేరుతోందా లేదా? తాము దేనికయితే పంపించామో ఆ పనులు అక్కడ జరుగుతున్నాయా లేదా? అనే విషయాలు తెలుసుకోవడం కష్టం. కనుక అదే అదునుగా ఎన్ఆర్ఐలను దోచుకొనేవారు కూడా ఉన్నారు. కనుక ఎన్ఆర్ఐలు ముందుకు రావాలంటే ప్రభుత్వం అందుకు తగిన బలమైన వ్యవస్థ లేదా యంత్రాంగాన్ని రూపొందించడం చాలా అవసరం. అప్పుడే ఎన్ఆర్ఐలు సహాయసహకారాలు అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తారు. 

Related Post