అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో చిట్ట చివరి అంకమైన ఎలెక్టోరల్ కాలేజి సభ్యులు ఎన్నికలు కూడా ముగిశాయి. దానిలో సభ్యులు డోనాల్డ్ ట్రంప్ కే మద్దతు పలికారు. దానితో ఆయన అమెరికా దేశాధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టడానికి ఆఖరి పరీక్షలో కూడా నెగ్గినట్లే అయ్యింది. ఈ విషయం తెలిసిన వెంటనే “వియ్ డిడ్ ఇట్” అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆయన జనవరి 8వ తేదీన అమెరికా 45వ అధ్యక్షుడుగా పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరిస్తారు.
ఆయన అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైనప్పటి నుంచే హెచ్-1బి వీసాలపై తన విధానాలను పునరుద్ఘాటించారు. అలాగే అమెరికాలో ఉన్న దేశవిదేశీ సంస్థలన్నీ తప్పనిసరిగా అమెరికన్లకు ఉద్యోగాలు ఈయవలసి ఉంటుందని ఖారాఖండీగా చెప్పారు. ఉద్యోగాల విషయంలో ట్రంప్ విధానాల వలన ప్రవాస భారతీయులతో సహా అమెరికా సంస్థలకు అవుట్ సోర్సింగ్ విధానంలో సేవలు అందిస్తున్న భారతీయ సంస్థలకు కొంత నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో ట్రంప్ తన సలహా మండలిలో భారత సంతతికి చెందిన ఇంద్రానూయి వంటివారిని సభ్యులుగా చేర్చుకోవడం విశేషమే. వారు నష్ట నివారణకు ప్రయత్నాలు చేయవచ్చు. ఇతర దేశాలతో ట్రంప్ ఏవిధంగా వ్యవహరించినా ఆయన భారత్ ఏవిధంగా వ్యవహరిస్తారనేదే మనకి ముఖ్యం. డోనాల్డ్ ట్రంప్ ఇంకా అమెరికా అధ్యక్షుడుగా భాద్యతలు చేపట్టక మునుపే చైనాతో మాటల యుద్ధం మొదలుపెట్టేశారు. చైనా కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆయనకీ ధీటుగా సమాధానాలు చెపుతోంది. ఈ కారణంగా ఆయన భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే భారత్-అమెరికా సంబంధాలు యధాప్రకారం కొనసాగవచ్చు.