అమెరికాలో ప్రవాస భారతీయుల కన్నీటి కధలు?

December 09, 2016
img

అమెరికాలో ఉద్యోగం అంటే ఉజ్వలమైన భవిష్యత్.. అందమైన జీవితం అనే దానిలో భిన్నాప్రాయాలు లేవు. కానీ అందుకు ప్రవాసభారతీయులు చెల్లించే మూల్యం కూడా ఆస్థాయిలోనే ఉంటుంది. తమ తల్లితండ్రులని, ఆప్త బండువులని, స్నేహితులని, పుట్టిపెరిగిన ఊరిని వదులుకోవలసి ఉంటుంది. అమెరికాలో అప్పుడప్పుడు జాతి వివక్షని, ఆ కారణంగా జరిగే దాడులని భరించవలసి ఉంటుంది. ఉద్యోగాల కోసం నిత్యం వందల కిమీలు కార్లలో ప్రయాణించవలసి ఉంటుంది. ఇంటి నుంచి బయలుదేరినవాళ్ళు మళ్ళీ క్షేమంగా తిరిగివచ్చే వరకు అందరికీ భయమే. కనుక అమెరికాలో ఉద్యోగాలు అంటే అందరూ భావిస్తున్నట్లు పూలపాన్పు కాదని చెప్పవచ్చు.

ఇటీవల అమెరికాలో వివిధ ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో అక్కడి ప్రవాసభారతీయులు ఎదుర్కొంటున్న మరొక రకమైన సమస్యలని, పరిస్థితులని కళ్ళకి కట్టినట్లు చూపుతున్నాయి. 

సునీల్ దంపతులది ఒక అందమైన చిన్న కుటుంబం. వారికి ఇద్దరు పిల్లలున్నారు. కొన్ని రోజుల క్రితమే సునీల్ కుటుంబం తమ స్నేహితుల కలిసి వారాంతపు శలవులలో హవాయ్ అనే ప్రాంతంలో విహరించడానికి వెళ్ళారు. అక్కడ గెస్ట్ హౌస్ తీసుకొని సరదాగానే గడిపారు. దాని సమీపంలోనే ఉన్న స్విమ్మింగ్ పూల్ పక్క నుంచి నడుస్తుండగా సునీల్ దానిలో పడిపోయాడు. అతనికి ఈత రాక పోవడంతో నీళ్ళలో మునిగిపోయాడు. భర్తని రక్షించుకోవడానికి సునీల్ భార్య స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసింది. కానీ ఆమెకి కూడా ఈత రాదు. అక్కడున్న ముగ్గురు వ్యక్తులు అతికష్టం మీద వారిద్దరినీ బయటకి తీసి రక్షించగలిగారు. కానీ సునీల్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందిప్పుడు. అతని బ్రెయిన్ సెల్స్ పూర్తిగా దెబ్బ తిన్నాయని అత్యవసరంగా వైద్యం అందించాలని చెప్పారు. దానికి 350,000 డాలర్లు అవసరం ఉంది. కానీ సునీల్ కుటుంబం వద్ద అంత డబ్బు లేదు. 

కేరళకి చెందిన బిజేష్ దంపతులది కూడా చూడముచ్చాటి చిన్న కుటుంబమే. వారికి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. నవంబర్ 28న బిజేష్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అందమైన వారి జీవితం అంధకారంగా మారిపోయింది. ఒక్కరోజులో వారి జీవితాలు చిన్నాభిన్నమైపోయాయి. అతని స్నేహితులు అందరూ కలిసి అతి కష్టం మీద బిజేష్ శవాన్ని అతని స్వస్థలానికి చేర్చగలిగారు. ఇప్పుడు వారి కుటుంబ పరిస్థితి చాల దయనీయంగా మారిపోయింది. కనుక దాతల సహాయం చాలా అవసరం.


డిశంబర్ 2న నపెర్ విల్లే-2 వద్ద జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో శివ చక్రధర (చక్రి) ఐనంపూడి మృతి చెందారు. విమానాశ్రయం నుంచి టాక్సీలో ఇంటికి తిరుగువస్తుండగా రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చిన వాహనం అతని జీవితానికి యమపాశం అయ్యింది. అతని భార్య ప్రతిమ, కుమారుడు ప్రణవ్ ల జీవితాలని అంధకారం చేసింది. చక్రి తల్లితండ్రులు, అత్తమామగారు అమెరికా చేరుకొన్నారు. అయితే చక్రిని మాత్రం వారు కాపాడుకోలేకపోయారు. ప్రమాదంలో అక్కడికక్కడే చక్రి మరణించారు. తమ కుటుంబం ఉజ్వల భవిష్యత్ కోసం అమెరికా వెళ్ళిన చక్రి మరణంతో అతని భార్యాబిడ్డలు భవిష్యత్ ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయింది.        

రత్నాకర్ శెట్టిపల్లి కుటుంబానికి కూడా ఇంచుమించు ఇదే అనుభవం ఎదుర్కొంటున్నారు. రత్నాకర్, అతని భార్య, పిల్లలతో కలిసి కారులో పయనిస్తుండగా ఎదురుగా ఒక వాహనం వచ్చి వారి కారుని డ్డీ కొంది. ఆ ప్రమాదంలో అందరూ ప్రాణాలతో బయటపడగలిగారు కానీ అంతకంటే ఎక్కువ నరకమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. రత్నాకర్, అతని ఐదేళ్ళ కుమార్తె కీర్తన శెట్టిపల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో వరుసగా అనేక శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో      తీవ్రంగా గాయపడిన అతని భార్య సుష్మా శెట్టిపల్లి, కొడుకు మహీధర్ శెట్టిపల్లి (4) చికిత్స పొందుతూ మరణించారు. ఆసుపత్రిలో వారి శస్త్ర చికిత్సలకి, మరణించిన వారిద్దరి శవాలని భారత్ లోని వారి స్వస్థలాలు తరలించేందుకు అత్యవసరంగా కనీసం 250,000 డాలర్లకి పైనే అవసరం ఉంటుంది.      

అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన, తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్నవారిని, వారి కుటుంబాలని కాపాడటానికి అందరూ తలో చెయ్యి వేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి అత్యవసర సమయంలో వారికి సహాయం చేయదలచుకొన్నవారు ‘www.gofundme.com’ అనే వెబ్ సైట్ ద్వారా నేరుగా వారికి దానిని అందించవచ్చు. దానిలోనే వారి కుటుంబ సభ్యుల ఫోటోలు, వివరాలు అన్నీ ఉంచబడ్డాయి.

Related Post