ట్రంప్ దెబ్బని ఆ విధంగా తట్టుకోబోతున్నాయిట!

December 05, 2016
img

అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలోనే దేశంలో స్థిరపడ్డ విదేశీయులపై, వారిని, విదేశీ సంస్థల సేవలని ఉపయోగించుకొంటున్న స్వదేశీ సంస్థలపై తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో తన ఆలోచనా విధానంలో ఎటువంటి మార్పు లేదని మరోమారు స్పష్టం చేస్తూ ట్రంప్ ఇటీవల స్వదేశీ సంస్థలకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికన్లకి ఉద్యోగాలు ఇవ్వడానికి వెనుకాడుతున్న సంస్థలపై బారీ జరిమానాలు విదిస్తానని హెచ్చరించారు. అమెరికన్ యువతకి ఉద్యోగాలు ఇవ్వని సంస్థలపై 35శాతం వరకు పన్నులు విదిస్తానని, ఉద్యోగాలు ఇస్తున్న సంస్థలకి కేవలం 15శాతం పన్ను మాత్రమే విదిస్తానని చెప్పారు. 

అయితే విదేశీ నిపుణులు, విదేశీ సంస్థలు చాల తక్కువ ధరలకే అత్యుత్తమైన సేవలు అందిస్తున్నప్పుడు, బారీ జీతాలు చెల్లించి అమెరికన్లని నియమించుకొంటే సంస్థలకి వారు చాలా ఆర్దిక భారంగా మారుతారు. ఇదే కారణం చేత డోనాల్డ్ ట్రంప్ తన సంస్థలలో కూడా అనేకమంది విదేశీయులని నియమించుకొన్నారు. కానీ ఇప్పుడు తను ప్రకటించిన  విధానాలని అందరి కంటే ముందుగా తనే  అమలుచేయవలసి ఉంటుంది. బహుశః అందుకే తన సంస్థలన్నిటినీ తన పిల్లలకి అప్పగించేస్తానని ప్రకతిన్చినట్లున్నారు. కానీ వారైనా ఆయన విధానాలని అమలుచేయక తప్పదు. కనుక వారు దానిని అమలు చేస్తారా లేదా...చేస్తే ఎప్పుడు ఏవిధంగా అమలు చేస్తారనేది తరువాత విషయం. ప్రస్తుతం దేశంలోని స్వదేశీవిదేశీ సంస్థలన్నీ ఆయన విధానాలని అత్యవసరంగా అమలుచేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.      

ఆయన హెచ్చరికలకి భయపడినందునో లేక పన్ను రాయితీలని అందుకోవడం కోసమో అప్పుడే దేశంలో అనేక స్వదేశీ విదేశీ సంస్థలు అమెరికన్ యువతకి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్దం అవుతున్నాయని సమాచారం. కొన్ని సంస్థలు క్యాంపస్ సెలెక్షన్స్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అమెరికాలోని భారతీయ సంస్థలు దీని వలన కలిగే అదనపు ఆర్ధిక భారం తగ్గించుకోవడానికి కాలేజీలు, యూనివర్సిటీల కొత్తగా డిగ్రీలు పూర్తి చేసుకొని బయటకి వస్తున్న యువతని ఉద్యోగాలలోకి తీసుకొని వారికి శిక్షణ ఇచ్చుకొని వారితోనే ‘పనికానిచ్చేయ్యాలని’ భావిస్తున్నాయి. తద్వారా ‘స్వామి కార్యం స్వకార్యం’ రెండూ నెరవేరుతాయని భావిస్తున్నాయి. 

Related Post