భారత్-పాకిస్తాన్ పట్ల అమెరికా ఎప్పుడు ద్వంద వైఖరినే అవలంభిస్తుంటుంది. అమెరికా అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికైనా ఆ విధానంలో ఎటువంటి మార్పు ఉండబోదని డోనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించబోతున్నారు. ఎన్నికల సమయంలో ఆయన పాకిస్తాన్ గురించి మాట్లాడిన మాటలకి, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి చాలా తేడా కనిపిస్తోంది. అప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశమని అన్న ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ ఒక అద్భుతమైన అవకాశాలు గల దేశమని అంటున్నారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయిన సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయనకి నిన్న ఫోన్ చేసి అభినందనలు తెలిపి, పాకిస్తాన్ లో పర్యటించవలసిందిగా ఆహ్వానించినప్పుడు, ఆయన నవాజ్ షరీఫ్ ని కూడా చాలా మెచ్చుకొన్నారని, పాకిస్తాన్ వంటి అధ్బుతమైన దేశంలో పర్యటించాలని తాను కూడా చాలా ఉవ్విళ్ళూరుతున్నానని చెప్పినట్లు పాక్ ప్రధాని కార్యాలయం పాక్ మీడియాకి తెలియజేసింది. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ పాకిస్తాన్ కి సంబందించిన ఎటువంటి అపరిష్కృత సమస్యల పరిష్కారానికైనా తను వ్యక్తిగతంగా చొరవ తీసుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ట్రంప్ చెప్పారని పాక్ ప్రధాని కార్యాలయం పేర్కొంది.
దౌత్యపద్దతుల ప్రకారం చూసినట్లయితే డోనాల్డ్ ట్రంప్ ఆవిధంగానే మాట్లాడటం సరైనదని చెప్పవచ్చు. కానీ ఎన్నికల ప్రచార సమయంలో అటువంటి వాటన్నిటినీ తాను అతీతుడనన్నట్లు ప్రపంచ దేశాల మీద, ముఖ్యంగా ముస్లింల మీద, పాకిస్తాన్ మీద చాలా రంకెలు వేసిన డోనాల్డ్ ట్రంప్ నిజంగానే ఇప్పుడు ఈవిధంగా మాట్లాడి ఉండి ఉంటే చాలా ఆశ్చర్యమైన విషయమే. అదే నిజమయితే ఆయన కూడా గతంలో పనిచేసిన అధ్యక్షులు నడిచిన మార్గంలోనే నడువబోతున్నారని భావించవచ్చు. అంటే ఆయన కూడా భారత్, పాక్ పట్ల ద్వంద వైఖరిని కొనసాగించబోతున్నట్లు భావించవచ్చు. డోనాల్డ్ ట్రంప్ పై ఆదేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపిస్తే ఆయన ఇంకా అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టక మునుపే ఈవిధంగా తన విధానాలని ఒక్కొక్కటీ మార్చుకొంటూ మళ్ళీ పాత పద్దతులలోనే ముందుకు సాగడానికి సిద్దపడుతుండటం విచిత్రంగానే ఉంది.