రేపటి నుంచే 50 శాతం సుంకాలు!

August 26, 2025
img

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, భారత్‌ ఎగుమతులపై ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించారు. ఈ నెల 27 నుంచి మరో 25 శాతం పన్ను విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. 

కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్‌ వెనక్కు తగ్గకపోవడంతో హెచ్చరించినట్లుగానే ఈరోజు అర్ధరాత్రి నుంచి పలు భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకాలు అమలులోకి వస్తాయని అమెరికా ప్రభుత్వం అధికారికంగా భారత్‌కు సమాచారమిచ్చింది. భారత్‌ కాలమాన ప్రకారం బుధవారం ఉదయం సుమారు 10 గంటల నుంచి ఈ 50 శాతం సుంకాలు అమలులోకి వస్తాయి. 

ప్రధాని మోడీ ఈ పెంపుపై స్పందిస్తూ, “మాకు మా దేశ ప్రయోజనాలే ముఖ్యం. రైతులు, వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలను కాపాడుకునేందుకు ఎంత దూరమైన వెళ్తాం. ఎన్ని ఒత్తిళ్ళయినా భరిస్తాం. మున్ముందు మరింత ఒత్తిళ్ళు వస్తాయని మాకు తెలుసు. వాటిని కూడా ఎదుర్కొంటాం తప్ప ఈ విషయం తగ్గే ప్రసక్తే లేదు,” అని స్పష్టం చేశారు. 

భారతీయులందరూ భారతీయ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని తద్వారా ట్రంప్‌ సృష్టిస్తున్న ఈ సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని బయటపడగలమని ప్రధాని మోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Related Post