క్యూబా మాజీ అధ్యక్షుడు, ప్రముఖ కమ్యూనిస్ట్ నేత ఫెడల్ కాస్ట్రో (90) ఆ దేశ కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి 10.29 గంటలకి చనిపోయినట్లు ఆయన సోదరుడు క్యూబా దేశాధ్యక్షుడు రవెల్ కాస్ట్రో ఆ దేశ ప్రభుత్వ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకి తెలియపరిచారు.
ఫెడల్ కాస్ట్రో 1926లో జన్మించారు. మొదటి నుంచి వామపక్ష భావాలు కలిగి ఉన్న కాస్ట్రో దేశంలో బాటిస్టా రాజరిక పాలనపై తిరుగుబాటు చేశారు. అందుకు 1953-55వరకు జైలు జీవితం గడిపారు. బయటకి వచ్చిన తరువాత మరొక ప్రముక విపలవకారుడు చె గువేరాతో కలిసి మళ్ళీ రాజరిక ప్రభుత్వంపై గెరిల్లా పద్దతిలో పోరాటాలు కొనసాగించారు. చివరికి 1959లో బాటిస్టా రాజరిక పాలనని అంతమొందించి క్యూబా దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దేశంలో కమ్యూనిస్టు పాలన బలపడింది. ఆయన కమ్యూనిష్ట్ దేశమైన రష్యాతో చేతులు కలిపి అమెరికాకి సింహస్వప్నంగా మారడంతో, ఆయనపై తరచూ హత్యా ప్రయత్నాలు జరిగేవి కానీ వాటి నుంచి తప్పించుకొంటూ 90 ఏళ్ళు జీవించగలిగారు.
ఆయన 1976లో క్యూబా అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆయన క్యూబా దేశాన్ని ఏకధాటిగా సుమారు 50ఏళ్ళకి పైగా పరిపాలించి, వయసు మీరడంతో 2008లో తన సోదరుడుకి తన భాద్యతలని అప్పగించి విశ్రాంత జీవితం గడిపి నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన బ్రిటికి ఉన్నంత కాలం క్యూబాలో అమెరికా కాలు మోపేందుకు అవకాశం ఇవ్వలేదు. అమెరికా చేసిన ప్రయత్నాలన్నిటినీ ఆయన గట్టిగా త్రిప్పికొడుతూ దేశాన్ని కాపాడుకొన్నారు. అందుకే క్యూబా ప్రజల దృష్టిలో ఆయన దేశాన్ని కాపాడిన ఒక మహనీయుడిగా గొప్ప గౌరవం ఉంది.