అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వివిద వస్తువులు, ఉత్పత్తులపై 25 శాతం పన్ను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆగస్ట్ 1వ తేదీ నుంచే పెంచిన పన్నులు జరిమానాతో కలిపి అమలులోకి వస్తాయని ట్రంప్ చెప్పారు.
అమెరికా దిగుమతులపై భారత్ చాలా విపరీతంగా పన్నులు విధిస్తోందని, తాము వారిస్తున్నా రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తోందని, అందుకే తాము కూడా భారత్ ఎగుమతులపై పన్నులతో పాటు జరిమానా కూడా విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు.
ఇదివరకు ట్రంప్ ఈ అదనపు పన్నుల ప్రకటన చేసినప్పటి నుంచి పలుమార్లు భారత్-అమెరికా మద్య చర్చలు జరిగాయి. కానీ అవి సఫలం కాకపోవడంతో ముందే హెచ్చరించినట్లు ట్రంప్ 25 శాతం పన్నులు, జరిమానా కూడా విదిస్తున్నట్లు ప్రకటించేశారు.
ట్రంప్ తాజా ప్రకటన భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది కనుక ఆ ప్రభావం దిగువ స్థాయి వరకు వ్యాపించి పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వ్యవసాయం తదితర రంగాలపై కూడా పడుతుంది. గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ నష్టాలలో కొనసాగుతున్న భారతీయ షేర్ మార్కెట్ మరింతగా నష్టపోయే ప్రమాదం ఉంది.
అయితే ట్రంప్ కొట్టబోయే ఈ దెబ్బ వలన పొంచి ఉన్న ప్రమాదాన్ని భారత్ ముందే పసిగట్టి ఇటీవలే బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకుంది.
దాని ప్రకారం భారత్ ఎగుమతులలో చాలా వస్తువులు, ఉత్పత్తులపై బ్రిటన్ ఎటువంటి పన్ను విధించకుండా దిగుమతి చేసుకొనేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం భారత్‌కు కాస్త ఉపశమనం కలిగిస్తుంది.