భారత్ కాలమాన ప్రకారం ఈరోజు (బుధవారం) రష్యాలో 8.8 తీవ్రతతో రష్యాలోమో కామ్చాట్కాలో భారీ భూకంపం వచ్చింది. ఓ పక్క ఈ భూకంపం చూసి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తుంటే, భూకంపం కారణంగా భారీ సునామీ కూడా రావడంతో ప్రజలకు ఏమి చేయాలో, ఎటు పోవాలో తెలీని పరిస్థితి ఏర్పడింది.
ఈ సునామీ జపాన్ వరకు విస్తరించడంతో ప్రభుత్వం సముద్ర తీరంలో నివసిస్తున్న లక్షల మందిని యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరికొన్ని గంటలలో అమెరికా పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలతో సహా 30 దేశాలలో సునామీ సంభవించవచ్చని అమెరికా హెచ్చరించింది.
ఆ జాబితాలో పేర్కొన్న దేశాలు రష్యా, చైనా, తైవాన్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, మెక్సికో, ఉత్తర, దక్షిణ కొరియా, మలేషియా, వియత్నాం, ఈక్వేడార్, చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి ద్వీపాలు, జార్విస్ ఐలాండ్, మిడ్ వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, జాన్‌స్టన్, పెరూ, సమోవా, సోలోమన్, నికరాగ్వా, పనామా, పపువా న్యూగినీ, బ్రూనై దేశాలకు సునామీ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు అమెరికా జారీ చేసింది. కనుక ఆయా దేశాలలో సముద్ర తీర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని అమెరికా సూచించింది.
ఈరోజు ఉదయం జపాన్ పసిఫిక్ సముద్రంలో సునామీ ధాటికి చాలా భారీ తిమింగలాలు అలలతో ఒడ్డుకు విసిరివేయబడినట్లు వచ్చి పడ్డాయంటే సునామీ తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సునామీ ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్త చర్యలుగా విమాన, నౌకాయాన సేవలు నిలిపివేస్తున్నారు.