పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ లండన్‌లో ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్లో విడుదలైనప్పుడు కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రంగు కాగితాలు చల్లారు.
దీనిపై ఆగ్రహించిన థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శన మద్యలో నిలిపివేసి, రంగు కాగితాలు చల్లినవారిని బయటకు పంపించేసింది. వారు బయటకు వెళితే తప్ప సినిమా ప్రదర్శన కొనసాగదని థియేటర్ సిబ్బంది తేల్చి చెప్పడంతో అయిష్టంగానే బయటకు వెళ్ళక తప్పలేదు.
మునుపటి తరం భారతీయులకు విదేశాలలో చాలా మంచి పేరుంది. వారు చాలా క్రమశిక్షణతో హుందాగా ప్రవర్తిస్తారని, చాలా కష్టపడి పనిచేస్తారని, అనసరమైన విషయాలలో జోక్యం చేసుకోరనే మంచి పేరుంది.
భారత్ నుంచి విదేశాలకు వస్తున్న ఇప్పటి తరంలో మంచి పనితనం, కష్టపడిపని చేసే గుణం, తెలివితేటలూ అన్నీ ఉన్నప్పటికీ, బహిరంగ ప్రదేశాలలో ఈవిదంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు.
అమెరికా, యూరోప్ దేశాలలో ప్రజలు చాలా క్రమశిక్షణ పాటిస్తారు. అటువంటి చోట మన భారతీయులు కొందరు భారత్‌లో మాదిరిగానే జండాలు పెట్టుకొని కార్లు, మోటార్ సైకిల్స్ ర్యాలీలు చేయడం, సినిమా థియేటర్ల లోపల, బయట ఈవిదంగా అతిగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఆ దేశస్థులకు భారతీయుల పట్ల అసహనం, చులకనభావం కలిగేలా వ్యవహరిస్తున్నారు.
భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిన ముందు తరంవారు చాలా గౌరవ మర్యాదలు పొందుతుంటే, యువతరం ఈవిదంగా వ్యవహరిస్తూ సమస్యలు కొనితెచ్చుకోవడమే కాకుండా, దేశ ప్రతిష్టకు భంగం కలిగించడం సబబేనా? ఆలోచించుకుంటే మంచిది.