రష్యాలోని అమూర్ అనే ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అంగారా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ ప్రయాణికుల విమానం (ఏఎన్-24) గురువారం ఉదయం రష్యాలోని బ్లాగోవేష్ నుంచి చైనా సరిహద్దులోని టిండా అనే ప్రాంతానికి బయలుదేరింది.
విమానం ల్యాండింగ్ అయ్యే ముందు వాతావరణం అనుకూలించకపోవడంతో రష్యా సరిహద్దులోని అమూర్ అనే ప్రాంతంలో దట్టమైన అడవులలో కూలిపోయింది. విమాన సిబ్బందితో కలిపి మొత్తం 49 మంది విమానంలో ఉన్నారు.
విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌తో కమ్యూనికేషన్ తెగిపోయి రాడార్ నుంచి అదృశ్యం కాగానే అత్యవసర సహాయ బృందాలు హెలికాఫ్టర్లలో గాలించగా అమూరు ప్రాంతంలో కుప్పకూలిపోయి మంటలకు ఆహుతైన విమానం కనిపించింది. సహాయ సిబ్బంది మంటలు ఆర్పారు కానీ ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది. రష్యా ప్రభుత్వం ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించింది.