ఖతార్‌పై ఇరాన్‌ దాడులు.. తిప్పి కొట్టిన అమెరికా

June 24, 2025
img

ఇరాన్‌ అణు స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా సోమవారం రాత్రి ఖతార్‌లోని అమెరికా వాయుసేన స్థావరంపై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేసింది. మొత్తం ఏడు క్షిపణులు ప్రయోగించగా వాటిని అమెరికా గగనతల రక్షణ వ్యవస్థ గాల్లోనే ధ్వంసం చేసింది. ఖతార్‌తో పాటు బహ్రెయిన్, కువైట్ దేశాలలో అమెరికా వాయుసేన స్థావరాలపై కూడా ఇరాన్‌ క్షిపణి దాడులు చేయగా అమెరికా వాటిని అడ్డుకుంది.   

ఖతార్‌పై ఇరాన్‌ దాడిని ఖతార్‌తో సహా సౌదీ అరేబియా, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఖతార్‌, కువైట్ దేశాలు ముందస్తు జాగ్రత్త చార్యలలో భాగంగా తమ గగనతలాన్ని మూసివేశాయి. దీంతో పౌర విమాన సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. ఖతార్‌లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేరళ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలు వెనక్కు తిరిగి వచ్చేశాయి.

ఇరాన్‌పై సోమవారం ఉదయం నుంచి ఇజ్రాయెల్‌ దాడులు మొదలుపెట్టి భారీగా నష్టం కలిగించింది. ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఫోర్డో అణు కేంద్రానికి వెళ్ళే అన్ని రోడ్డు మార్గాలను బాంబులతో ధ్వంసం చేసింది. ఇరాన్‌ వాయుసేన స్థావరాలపై విరుచుకుపడి పలు యుద్ధవిమానాలు ధ్వంసం చేసింది. 

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఇరాన్‌ మిలటరీ ప్రధాన కేంద్రం)పై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించి ధ్వంసం చేశాయి. ఈ దాడిలో పలువురు ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారులు, సైనికులు చనిపోయారు. టెహ్రాన్‌లో రాజకీయ ఖైదీలను, ముఖ్యంగా విదేశయులను బందీలుగా ఉంచే జైలు గోడలను డ్రోన్లతో బద్దలు కొట్టి బందీలకు విముక్తి కల్పించింది. 

Related Post