కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ ప్రారంభించింది. ‘ఆపరేషన్ సింధూర్’లో పాక్ స్థావరాలపై బాంబు దాడులు చేయగా ‘ఆపరేషన్ సింధు’లో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు చేపట్టింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మద్య జరుగుతున్న యుద్ధం నానాటికీ తీవ్రం అవుతుండటం ఏ క్షణంలోనైనా అమెరికా కూడా ఇరాన్‌పై దాడులు చేయబోతుండటంతో, ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను వెనక్కు తీసుకురావడానికి విమానాలు పంపిస్తోంది.
ఉత్తర ఇరాన్‌కు సమీపంలో గల ఆర్మేనియా రాజధాని ఎరవాన్ నుంచి మంగళవారం 110 మంది విద్యార్ధులను ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించింది. దాడులు ఎక్కువగా జరుగుతున్న టెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న భారతీయులందరూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని లేదా ఎరవాన్ చేరుకోవలసిందిగా ఇరాన్‌లోని భారతీయ ఎంబసీ అధికారులు సూచించారు. ఎరవాన్ చేరుకున్నవారిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలిస్తోంది.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలలో యుద్ధ ప్రదేశాలలో చిక్కుకున్న తెలంగాణవాసుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసింది. వారు ఈ హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి తమ సమాచారం ఇచ్చినట్లయితే, విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందించగలమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. హెల్ప్ లైన్ నంబర్లు:
వందన (రెసిడెంట్ కమీషనర్ పీఎస్): +91 9871999044
జి. రక్షిత్ నాయక్ (లైజన్ ఆఫీసర్): +91 9643823157
జావేద్ హుస్సేన్ (లైజన్ ఆఫీసర్): +91 9910014749
సిహెచ్ చక్రవర్తి ((పౌర సంబంధాల అధికారి): +91 9949351270.