ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అధ్యక్షుడుగా ఎన్నికైన శ్రీహరి మందాడ బుధవారం న్యూజెర్సీలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రమానాయస్వీకారం చేయించారు. అనంతరం శ్రీహరి నాట్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
నాట్స్ తరపున మరిన్ని చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జూలై 4 నుంచి 6 వరకు ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా నగరంలో నాట్స్ 8 వ మహాసభ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సభకి ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ తదితరులను ఆహ్వానించామని చెప్పారు. ఈ సభలో నాట్స్ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని శ్రీహరి మందాడ విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నత విద్యల కోసం వచ్చిన భారతీయ విద్యార్ధులతో సహా ఉద్యోగులు, వారి కుటుంబాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కనుక ఇటువంటి క్లిష్ట సమయంలో నాట్స్, తానా వంటి సంస్థలు బలంగా ఉండటం, అవసరమైనప్పుడు వారికి అన్ని విదాల సహాయ సహకారాలు అందిస్తుండటం చాలా అభినందనీయం. చాలా అవసరం కూడా.
అమెరికాలో మారిన పరిస్థితుల గురించి అవగాహన లేకుండా భారత్ నుంచి అక్కడకు రావాలని తహతహలాడుతున్నవారికి, ఈ రెండు సంస్థలు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కౌన్సిలింగ్ సేవలు అందించగలిగితే చాలా మేలు చేసినట్లవుతుంది కదా?