హైదరాబాద్ లతా మంగేష్కర్‌గా నగర ప్రజలకు చిరపరిచితులైన రజియా సుల్తానా (53) కెనడా, టొరంటోలో అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో శనివారం మృతి చెందారు. టొరంటోలో ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె వెళ్ళారు. ఆమెకు భర్త, కుమార్తె ఉన్నారు.
రజియా సుల్తానా గత మూడు దశాబ్ధాలుగా హైదరాబాద్‌తో సహ తెలంగాణ అంతటా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించి తన పాటలతో అందరినీ అలరించారు.
అనేక ఏళ్ళుగా ఆమె ప్రతీ మొదటి శనివారం తన ఇంట్లో, ప్రతీ నెల రెండో శనివారం గాంధీ భవన్‌లో ఆడిటోరియంలో, మూడో శనివారం గన్ ఫౌండ్రీ మీడియా హాల్లో సంగీత కార్యక్రమం, దానిలో చక్కటి గజల్స్ ఆలపిస్తూ అందరినీ అలరించారు.
ఆమె పాటలు వినేందుకు హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టూపక్కల జిల్లాల నుంచి కూడా అభిమాణులు వస్తుండేవారు. రెండేళ్ల క్రితం ఆమెకు గుండెపోటు రాగా వైద్యులు స్టంట్స్ వేయడంతో మళ్ళీ యధాప్రకారం సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు టొరంటోలో అభిమానుల ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్ళగా గుండెపోటుతో చనిపోయారు. అందుకు అక్కడి అభిమానులు చాలా ఆవేదన చెందుతున్నారు. టొరంటోలోనే రజియా సుల్తానా అంత్యక్రియలు జరిగాయి.
ఆమె ఆకస్మిక మృతి పట్ల హైదరాబాద్‌లో ఆమె అభిమానులు ‘ఇకపై మా లత కనిపించదు.. వినిపించదంటూ’ తీవ్ర ఆవేదన చెందుతున్నారు.