డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవడం నేటికీ అమెరికాలో అనేకమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రపంచదేశాల సంగతి చెప్పనక్కర లేదు. కారణాలు అందరికీ తెలిసినవే. ట్రంప్ ని వ్యతిరేకించేవారిలో సౌత్ కరోలినా గవర్నర్ నిక్కి హెలీ కూడా ఒకరు. ఆమె భారత సంతతికి చెందినవారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత చాలా నెలల పాటు ఆమె ట్రంప్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అదే విధంగా ట్రంప్ కూడా ఆమెపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని నెలల క్రితం ఆమె అకస్మాత్తుగా ట్రంప్ పక్షంలోకి మారిపోయి ఆయనకి మద్దతు పలికారు. అప్పుడు కూడా ఆమె తను ట్రంప్ ని అభిమానించనప్పటికీ ఆయనకే ఓటు వేస్తానని చెప్పడం విశేషం. అంటే అప్పటికీ వారి మద్య అంత సయోధ్య లేదని స్పష్టం అవుతోంది.
ట్రంప్ విజయం సాధించిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ “గత ఐదేళ్ళు వాషింగ్ టన్ తో కత్తిమీద సాములాగ పనిచేశాను. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. ఆయన పాలన ఏవిధంగా ఉండబోతోందో ఊహించలేకపోతున్నాను. కానీ ఇప్పుడు దేశంలో పెను మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రభావం మా పార్టీ మీదే కాకుండా దేశంలో ప్రతీ పౌరుడుపై ఉండవచ్చు,” అని నిక్కి హెలీ అన్నారు.
ట్రంప్ పట్ల ఆమె కనబరిచిన వ్యతిరేకత కారణంగా ఆయన ఆమెని దూరంగా ఉంచుతారని అందరూ ఊహించారు. కానీ ట్రంప్ ఆమెకే అత్యున్నత పదవిని కట్టబెట్టారు. ఆమెని ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా ఖరారు చేశారు.
నిక్కి హెలీ అసలు పేరు నిమ్రత. ఆమె తలితండ్రులు భారత్ లో పంజాబ్ రాష్ట్రం నుంచి అమెరికా వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ఆమె తండ్రి పేరు అజిత్ సింగ్ రణ్ దవా, తల్లి పేరు రాజ్ కౌర్. నిక్కి హెలీ జనవరి 20, 1970లో సౌత్ కరోలినాలోని బామ్ బెర్గ్ లో జన్మించారు. ఆమె తల్లి తండ్రులు ఆమెని ముద్దుగా నిక్కీ అని పిలుచుకొనేవారు. చివరికి అదే పేరుతో ఆమె అందరికీ పరిచితులయ్యారు. ఆమె అమెరికా ఆర్మీలో మైకేల్ హెలీని వివాహం చేసుకోవడం నిక్కి హెలీ అయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.