న్యూయార్క్ నగరంలో గురువారం మధ్యాహ్నం హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా సీమెన్స్ కంపెనీ స్పెయిన్ దేశపు సీఈవో ఆగస్టన్ ఎస్కోబార్, భార్య, ముగ్గురు పిల్లలు చనిపోయారు.
వారు అమెరికా విహారయాత్రకు వచ్చి ఓ హెలికాఫ్టర్ అద్దెకు తీసుకొని న్యూయార్క్ నగరంలో తిరుగుతున్నప్పుడు హడ్సన్ నదిపై అదుపు తప్పి గాలిలో గిరగిరా తిరుగుతూ నదిలో నిలువుగా కూలిపోయింది.
ఆ సమయంలో పరిసర ప్రాంతాలలో ఉన్నవారు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంతో ప్రమాద సమయంలో ఆగస్టన్ ఎస్కోబార్ కుటుంబం ఎంత భయానక పరిస్థితిలో ఉందో అర్దమవుతోంది.
ఈ సమాచారం అందగానే సహాయ సిబ్బంది బోట్లలో అక్కడకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాఫ్టర్ చాలా వేగంగా దూసుకు వచ్చి నదిలో పడిపోవడంతో నదీ గర్భంలో కూరుకుపోయింది.
దానిలో చిక్కుకుపోయిన ఆగస్టన్ ఎస్కోబార్, భార్య పిల్లల మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయ సిబ్బంది కృషి చేశారు. సాధ్యం కాకపోవడంతో హెలికాఫ్టర్‌తో సహా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.