ట్రంప్ నిర్ణయం భారత్‌ అలా వాడేసుకుంటోంది!

February 12, 2025
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఆదేశం మేరకు అమెరికన్ పోలీసులు వారి దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులందరినీ వెతికి పట్టుకొని తిప్పి పంపించేస్తున్నారు. ఇప్పటికే పలువురు భారతీయులను వెనక్కు పంపింది. అయితే భారత ప్రభుత్వం దీనినీ తెలివిగా ఉపయోగించుకునేందుకు సిద్దమవుతోంది. 

భారత్‌లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ఇంకా ఆర్ధిక నేరాలు చేసిన పలువురు క్రిమినల్స్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోతుంటారు. అమెరికాకు పారిపోయినవారు కూడా చాలా మందే ఉన్నారు. 

కనుక అమెరికా పారిపోయిన మోస్ట్ వాంటడ్ జాబితాని బయటకు తీసి నిందితుల పేర్లు, వివరాలు అమెరికా ప్రభుత్వానికి అందించి వారిని వెనక్కు రప్పించేందుకు హోం, విదేశాంగ శాఖలు సన్నాహాలు చేస్తున్నాయి. 

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఇంటలిజన్స్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ దాదాపు ఏడాదికి పైగా అమెరికాలోనే ఉంటున్నారు. తెలంగాణ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయగానే వైద్య చికిత్స కోసం అంటూ అమెరికా వెళ్ళిపోయి తిరిగి రాకుండా అక్కడే ఉంటున్నారు. తనకు రాజకీయ శరణార్ధి అమెరికాలో ఆశ్రయం కల్పించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు కూడా. 

ఆయనని రప్పించేందుకు తెలంగాణ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వానికి ఇటువంటి కేసులున్నవారందరి వివరాలు అందిస్తే, మనకి శ్రమ లేకుండా అమెరికా అధికారులే వారిని బందించి భద్రంగా తీసుకువచ్చి అప్పజెప్పుతారు కదా?

Related Post