ఏటా అక్రమ వలసదారులను తిప్పి పంపిస్తూనే ఉంది!

February 07, 2025
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఆదేశం మేరకు, అమెరికా పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను వెతికి పట్టుకొని వెనక్కు తిప్పి పంపించేస్తున్నారు. 

తొలి విడతలో 104 మంది భారతీయులను మిలటరీ విమానంలో తిప్పి పంపగా, తాజాగా మరో 487 మందిని పంపేందుకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

అక్రమంగా నివసిస్తున్నవారిని వెనక్కు తిప్పి పంపడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ వారి కాళ్ళకు సంకెళ్ళు వేయడం మానవ హక్కుల ఉల్లంఘనే. వారు ఆ సంకెళ్లతో మిలటరీ విమానంలోకి వెళుతున్నప్పుడు ఆ వీడియో చిత్రీకరించి మీడియాకు విడుదల చేయడం ఇంకా తప్పు. 

విదేశాలలో ఉన్న ఆమెరికన్లకు ఆయా దేశాలు ఇదేవిదంగా సంకెళ్ళు వేసి వీడియో తీసి పంపిస్తే అమెరికా సహించగలదా?అంటే లేదనే చెప్పవచ్చు. వెంటనే ఆ దేశంపై ఏదో రూపంలో ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది. కానీ విదేశీయుల పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుని యావత్ ప్రపంచదేశాలు తప్పు పడుతున్నా పట్టించుకునే పరిస్థితిలో లేదు. 

దీని గురించి భారత్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందిస్తూ, “ఇది అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కనుక ఈవిదంగా చేస్తోంది. కానీ సంకెళ్ళు వేయడంపై మన ప్రభుత్వం తరపున అమెరికాకు అభ్యంతరం తెలుపుతాము,” అని చెప్పారు. 

అక్రమ వలసదారులని తిప్పి పంపిస్తుండటం గురించి వివరిస్తూ, “ఇవాళ్ళ కొత్తగా ఇది మొదలుపెట్టలేదు. ఎన్నో ఏళ్ళ నుంచి తిప్పి పంపిస్తూనే ఉంది. గడచిన 15 ఏళ్ళలో 15,756 మందిని వెనక్కు తిప్పి పంపించింది. 

2009 లో 734 మంది, 2010లో 799, 2011లో 597, 2012 లో 530, 2013 లో 515, 2014 లో 591,2015 లో 708, 2018 లో 1180, 2019లో 2,042. 2020 లో 1889, 2021 లో 805, 2022 లో 862, 2023 లో 617, 2024 లో 1368, 2025 లో ఇప్పటి వరకు 104 మందిని అమెరికా నుంచి వెనక్కు తిప్పి పంపారు” అని విదేశాంగ మంత్రి జైశంకర్ మీడియాకు తెలియజేశారు. 

Related Post