మూడు దేశాలకు ట్రంప్ షాక్.. తర్వాత భారత్‌?

February 02, 2025
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ముందు నుంచి చెపుతున్నట్లుగానే కెనడా, మెక్సికో, చైనాలకు పెద్ద షాక్ ఇచ్చారు. ఆ దేశాల నుంచి అమెరికా దిగుమతులపై భారీగా పన్ను విధించారు. కెనడా, మెక్సికో దేశాల ఉత్పత్తులపై 25శాతం , చైనా ఉత్పత్తులపై 10 శాతం పన్ను విధించారు. ఈ మేరకు ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. 

ఆమెరికన్లకు ఆదాయపన్ను మినహాయించి వారి మిగులు ఆదాయం మరింత పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపడతానని ట్రంప్ ఇటీవలే చెప్పారు. తద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆమేరకు ఆదాయం తగ్గి అదనపు భారం కూడా పడుతుంది. కనుక దానిని భర్తీ చేసుకోవడానికే ట్రంప్ విదేశీ దిగుమతులపై ఈ పన్నులు విధించిన్నట్లు భావించవచ్చు. ఫెడరల్ ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకే పన్నులు విధించానని ట్రంప్ స్వయంగా చెపుతున్నారు.

“అమెరికాలో అక్రమంగా లక్షల మంది విదేశీయులు ప్రవేశిస్తున్నారు. అనేక ప్రమాదకరమైన మందులు, మాదక ద్రవ్యాలు అమెరికాలోకి వస్తున్నాయి. కనుక ఈ ముప్పు నుంచి ఆమెరికన్లను కాపాడుకుంటానని నేను ఎన్నికలలో వాగ్ధానం చేశాను. కనుక అమెరికన్లు అందరికీ భద్రత కల్పించడం నా బాధ్యత. అందుకే విదేశీ ఉత్పత్తులపై సుంకాలు పెంచాను,” అని ట్రంప్ అన్నారు.  

భారత్‌ దిగుమతులపై కూడా పన్నులు విధిస్తానని  ట్రంప్ చెపుతూనే ఉన్నారు. మూడు దేశాలపై పన్నులు విధించి  చెప్పింది చేస్తానని ట్రంప్ నిరూపించుకున్నారు. కనుక తర్వాత భారత్‌ వంతే అనుకోవచ్చు. 

Related Post