అమెరికాలో జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని వ్యతిరేకిస్తూ అప్పుడే కోర్టులో కేసులు దాఖలు అవుతున్నాయి. అమెరికాలో డెమొక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో కేసులు వేశాయి.
ఇదివరకు అమెరికన్ పౌరసత్వం కోసమే చాలామంది కాన్పుల కోసం అమెరికా వెళ్ళేవారు. కానీ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఫిబ్రవరి 19 తర్వాత అమెరికాలో శాశ్విత పౌరసత్వంలేని దంపతులకు పుట్టే పిల్లలకు జన్మతః అమెరికన్ పౌరసత్వం లభించదు.
అమెరికాలో సుమారు 1.40 కోట్ల మందిఅక్రమంగా నివసిస్తున్నారు. వారిలో సుమారు 7.25 లక్షల మంది భారతీయులు కూడా ఉన్నారు.
వారుకాక స్టూడెంట్ వీసాలు, ఉద్యోగ వీసాల, డిపెండెంట్ వీసాలతో వచ్చి ఉంటున్నవారు మరో 40-50 లక్షల మంది ఉన్నారు.
వారిలో చాలా మంది అమెరికన్ పౌరసత్వం ప్రసాదించే గ్రీన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ గ్రీన్ కార్డు లేనివారికి అమెరికాలోనే పిల్లలు పుట్టినా ఆ పిల్లలకు అమెరికన్ పౌరసత్వం లభించదు. కనుక వారందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన దేశంలో చాలా గందరగోళం ఏర్పడుతుందని, ఊహించని అనేక సమస్యలు వస్తాయని డెమోక్రాట్స్ వాదిస్తూ కోర్టులలో కేసులు వేస్తున్నారు.