ఈ నెల 20 నుంచి ఐదు రోజులపాటు దావోస్ ప్రపంచదేశాల ఆర్ధిక సదస్సు జరుగబోతోంది. దీనిలో పాల్గొనేందుకు సిఎం రేవంత్ రెడ్డి బృందం గురువారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరింది. ముందుగా రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన తర్వాత అక్కడి నుంచి దావోస్ చేరుకుంటారు.
సిఎం రేవంత్ రెడ్డి బృందం శుక్రవారం సింగపూర్‌లో చాంగీ నగరంలో స్కిల్ యూనివర్శిటీని సందర్శించి, దాని నిర్వహణ, శిక్షణ, వివిద కోర్సులు తదితర అంశాల గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో వరుస సమావేశాలలో పాల్గొంటారు.
గత ఏడాది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే దావోస్ సదస్సుకి వెళ్ళి సుమారు రూ.40,000 కోట్ల పెట్టుబడులు సాధించుకువచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకొని స్థిరంగా, బలంగా ఉంది.
ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ పరిశ్రమలను, ఐటి కంపెనీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉంది. కనుక ఈసారి మరింత ఎక్కువ పెట్టుబడులు సాధించే అవకాశం కనిపిస్తోంది.