దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం

December 29, 2024
img

దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. థాయ్‌లాండ్ నుంచి మువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండ్ అయిన విమానం అదుపు తప్పి రన్ వేపై వేగంగా దూసుకుపోయి ప్రహారీ ఫెన్సింగ్‌ని బలంగా ఢీకొట్టడంతో విమానం పేలిపోయి మంటలు వ్యాపించాయి. 

ప్రమాదం జరిగినప్పుడు విమానంలో ఆరుగురు సిబ్బంది, 175 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం పేలిపోయి మంటలు అంటుకోవడంతో ఘటనా స్థలంలోనే 29 మంది చనిపోయారని, ఒక ప్రయాణికుడు, ఒక విమాన ఎయిర్ హోస్టెస్ మాత్రం స్వల్పగాయాలతో బయటపడిన్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

మంటలలో కాలి నుజ్జునుజ్జు అయిన విమాన శిధిలాలను గమనిస్తే ప్రయాణికులు ఎవరూ బ్రతికి ఉండే అవకాశం లేదని అర్దమవుతోంది. విమానంలో ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ దక్షిణ కొరియాకు చెందినవారే అని అధికారులు తెలిపారు. 

పెద్ద శబ్ధంతో విమానం పేలిపోయి మంటలు అంటుకోవడంతో విమానాశ్రయం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికే విమానం పూర్తిగా మంటలలో కాలి బూడిదైంది. బహుశః సాంకేతిక లోపం కారణంగా బ్రేకులు పనిచేయకపోవడం వలననే విమానం రన్ వేపై ఆగకుండా ముందుకు దూసుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.               

Related Post