అమెరికా యావత్ ప్రపంచ దేశాలను శాశించగలుగుతోంది కానీ స్వదేశంలో తుపాకీ సంస్కృతిని అరికట్టలేకపోతోంది. ఈ కారణంగా ఆ దేశంలో ఏటా వందల మంది బలవుతూనే ఉన్నారు. తాజాగా విస్కానసిన్స్‌లోని మాడిసన్‌లో గల అబండంట్ క్రీస్టియన్ పాఠశాలలో కాల్పులు జరిగాయి.
అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్ధి కాల్పులు జరపగా ఐదుగురు మరణించారు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ పాఠశాలలో మొత్తం 400 మంది విద్యార్ధులున్నారు. కానీ కాల్పుల శబ్ధం వినపడగానే అందరూ భయంతో అక్కడి నుంచి బయటకు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు, హుటాహుటిన అక్కడకు చేరుకొని కాల్పులు జరిపిన విద్యార్ధిని చుట్టుముట్టి కాల్చి చంపిన్నట్లు సమాచారం. అంబులెన్సులలో గాయపడినవారికి ప్రాధమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు.
అమెరికాలో అప్పుడే క్రిస్మస్ హడావుడి మొదలైపోయింది. ఏడాది ముగుస్తుండగా సరిగ్గా క్రిస్మస్ పండుగకు ముందు ఈ విషాద ఘటన జరగడం చాలా బాధాకరమే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇటువంటి కాల్పుల ఘటనకు 322 జరిగాయి. అంటే సగటున ప్రతీ ఒకటిన్నరోజులకి ఒకటి చొప్పున జరిగాయన్న మాట. అయినా అమెరికా ప్రభుత్వం తుపాకీ సంస్కృతిని కట్టడి చేయలేకపోతోంది.