ఆ వార్త నిజమేనా? అయితే మంచిదే!

November 17, 2016
img

యూరి ఆర్మీ క్యాంప్ పై పాక్ ఉగ్రవాదులు దాడులు చేసి19మంది భారతీయ సైనికులని చంపిన తరువాత పాకిస్థాన్ని ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న దేశంగా ప్రకటించాలని కోరుతూ ఇద్దరు సేనేటర్స్ అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. కానీ ఒబామా ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకోబోమని తేల్చి చెప్పడంతో పాకిస్తాన్ పెద్దగండం నుంచి తప్పించుకొంది. అయితే ఆ బిల్లు నేటికీ అమెరికన్ కాంగ్రెస్ లోనే ఉంది.

ఇపుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవడంతో ఆ బిల్లుని ఆయన ఆమోదించబోతున్నారని అయన సలహాదారుల బృందంలో ఒకరైన షాలబ్ కుమార్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ట్రంప్ జనవరిలో అధ్యక్షుడుగా భాద్యతలు చేపట్టిన తరువాత జరిగే మొట్ట మొదటి కాంగ్రెస్ సమావేశాలలోనే పాకిస్థాన్ని ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న దేశంగా ఇదివరకు ప్రవేశపెట్టిన బిల్లుని సభ చేత ఆమోదింపజేస్తారని షాలబ్ కుమార్ చెప్పారు.

ఉగ్రవాదుల పట్ల  చాలా కటినంగా వ్యవహరిస్తానని ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. కనుక షాలబ్ కుమార్ చెప్పిన్నట్లుగా ట్రంప్ ఆ బిల్లు ఆమోదానికి ప్రయత్నించవచ్చునని భావించవచ్చు. కానీ కాంగ్రెస్ అందుకు ఒప్పుకొంటుందా లేదా అనేదే చూడాలి. ఒకవేళ శాలాబ్ కుమార్ చెప్పినట్లు ట్రంప్ ఆ బిల్లుని ఆమోదింపజేయగలిగితే, ఉగ్రవాదంపై పోరుకోసం అంటూ అమెరిక ప్రతీ ఏటా పాకిస్తాన్ కి చెల్లిస్తున్న కోట్లాది డాలర్ల ఆర్ధిక సహాయం నిలిచిపోవడం తధ్యం. అదే జరిగితే పాక్ పరిస్థితి చాలా దయనీయంగా మారే ప్రమాదం ఉంటుంది. కనుక అటువంటి పరిస్థితి రాకమునుపే పాక్ మేలుకొని ఉగ్రవాదులపై నిజంగా చర్యలు చేపడితే దానికే చాలా మంచిది.

Related Post