అమెరికాలో ఉప్పల్ యువకుడు మృతి

November 22, 2024
img

హైదరాబాద్‌, ఉప్పల్‌కు చెందిన ఆర్యన్ రెడ్డి (23) ఈ నెల 13న అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించాడు. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో కెన్నెసా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆర్యన్ రెడ్డి అదే రోజు తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు.

కొంత సేపు తర్వాత అతని గదిలో నుంచి తుపాకీ పేలిన శబ్ధం వినిపించగా స్నేహితులు వెళ్ళి చూస్తే ఆర్యన్ రెడ్డి రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించాడు. అతను తన తుపాకీని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి తూటా ఛాతిలో నుంచి దూసుకుపోయిన్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఈరోజు రాత్రికి అమెరికా నుంచి అతని మృతదేహం హైదరాబాద్‌ చేరుకోనుంది. 

ఆర్యన్ రెడ్డి మొదట భారత్‌ ఆర్మీలో చేరాలనుకుంటే తల్లి తండ్రులు వద్దని చెప్పడంతో ఉన్నత విద్య కోసం రెండేళ్ళ క్రితం అమెరికా వెళ్ళాడు. ఆర్యన్ రెడ్డి ఆర్మీలో చేరలేకపోయినా తుపాకీపై మోజు అలాగే ఉంది.

ఆర్యన్ రెడ్డి నాలుగు నెలల క్రితమే హంటింగ్ గన్ కోసం దరఖాస్తు చేసుకొని దానిని పొందేందుకు పరీక్ష కూడా వ్రాసి మరీ కొనుకొన్నాడు. ఆ తుపాకీ ముచ్చటే చివరికి అతని ప్రాణం తీసింది. అదీ సరిగ్గా అతని 23వ పుట్టిన రోజునాడే. ఉప్పల్, ధర్మపురి కాలనీలో నివశిస్తున్న అతని తల్లితండ్రులు పాల్వాయి సుదర్శన్ రెడ్డి, గీత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్యన్ రెడ్డి వారి ఏకైక కుమారుడు.

Related Post