అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకే ఒక్క సంతకంతో రష్యా-ఉక్రెయిన్ మద్య క్షిపణులతో యుద్ధం మొదలయ్యేలా చేశారు. ఇరు దేశాల మద్య యుద్దం ప్రారంభం అయ్యి 1,000 రోజులు అయిన సందర్భంగా ఉక్రెయిన్‌కి అమెరికా సరఫరా చేసిన దీర్గ శ్రేణి క్షిపణులను రష్యా పై ప్రయోగించేందుకు అనుమతిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు.
ఉక్రెయిన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రష్యాపై అమెరికా క్షిపణితో దాడి చేసింది. దానికి బదులుగా రష్యా కూడా అత్యంత వినాశకారిగా పేరొందిన ఖండాంతర క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది.
వెయ్యి రోజుల యుద్ధం తర్వాత ఇరు దేశాలు ఇక యుద్ధం చేయలేని స్థితికి చేరుకుంటుండగా అమెరికా అధ్యక్షుడు పెట్టిన ఒక్క సంతకంతో రష్యా-ఉక్రెయిన్ మద్య మరింత భీకర యుద్ధం మళ్ళీ ప్రారంభం అయ్యింది.
జో బైడెన్ నిర్ణయంతో రష్యా తప్పకుండా ఉక్రెయిన్‌పై దాడి చేస్తుందని ముందే ఊహించిన అమెరికాతో సహా పలు యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌లో తమ రాయబార కార్యాలయాలు మూసేసి స్వదేశాలకు వెళ్ళిపోయాయి. అవి ఊహించిన్నట్లే రష్యా ఖండాంత క్షిపణితో ఉక్రెయిన్‌పై దాడి చేసింది.
తమ దేశంపై అమెరికా క్షిపణులతో దాడి చేసేందుకు జో బైడెన్ ఉక్రెయిన్‌ని అనుమతించగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అణ్వస్త్ర ప్రయోగంపై విధించుకున్న ఆంక్షలను సరళతరం చేసే ఫైలుపై సంతకం చేశారు.
అమెరికా క్షిపణులతో రష్యాపై దాడి చేయడాన్ని అమెరికా దాడిగానే పరిగణిస్తామని, దీనికి తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని రష్యా తీవ్రంగా హెచ్చరించింది. వెంటనే అణ్వస్త్ర ప్రయోగానికి పుతిన్ లైన్ క్లియర్ చేశారు. అంటే వాటిని ప్రయోగించేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన్నట్లే.
జో బైడెన్ మరో నెల రోజుల్లో అధ్యక్ష పదవిలో నుంచి దిగిపోతారు. ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
దిగిపోయే ముందు ఇటువంటి ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బైడెన్ దిగిపోతూ అమెరికాకి కూడా పెను ప్రమాదం తెచ్చిపెట్టాడని అమెరికన్లే విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేరు. కనుక రష్యా దాడి చేస్తే ఎదుర్కొనేందుకు అమెరికా కూడా సిద్దంగా ఉండక తప్పదు.