ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి కేరాఫ్ అడ్రస్ దేశాలలో ఒకటైన పాకిస్తాన్‌లో ఈరోజు (శనివారం) ఉదయం క్వెట్టా రైల్వే స్టేషన్‌లో భారీ బాంబు విస్పోటనం జరిగింది. స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద జరిగిన పేలుడులో 21 మంది ఘటనస్థలంలోనే చనిపోగా, మరో 46 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రేలుడు ధాటికి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం కప్పు తునాతునకలైపోయింది. అదే సమయంలో క్వెట్టా నుంచి పెషావర్ బయలుదేరుతున్న రైల్లో ఉన్న ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
ఈ సమాచారం అందగానే జిల్లా పోలీసులు, వైద్య సహాయ బృందాలు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సులలో సమీపంలో ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు, బాంబు ప్రేలుడు నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్‌లో మరెక్కడైనా బాంబులు ఉన్నాయేమో కనిపెట్టేందుకు జల్లెడపడుతున్నారు. సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు.