అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మద్య హోరాహోరీగా పోరు సాగినప్పటికీ చివరికి ట్రంప్ విజేతగా నిలిచారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి 274 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా డొనాల్డ్ ట్రంప్‌కి 267 ఓట్లు (51.2శాతం), కమలా హారిస్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు (47.4 శాతం) లభించాయి. ఏడు ‘స్వింగ్ స్టేట్స్’లో మూడు గెలుచుకొని మిగిలిన నాలుగు రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యతతో కొనసాగుతున్నారు.
కనుక ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి 300 పైనే ఎలక్టోరల్ ఓట్లు రావచ్చని అంచనా. ఇంత భారీ మెజార్టీతో ట్రంప్ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధ్యక్ష పదవి చేపట్టబోతుండటంతో, ఆయనకు అప్పుడే ప్రపంచదేశాలు అభినందనలు తెలియజేస్తున్నాయి.
తన విజయంపై ట్రంప్ స్పందిస్తూ “నాపై నమ్మకం ఉంచి ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. అమెరికాకు మళ్ళీ స్వర్ణ యుగం రాబోతోంది,” అని అన్నారు.
ఆనవాయితీ ప్రకారం ఎలెక్టోరల్ కాలేజ్ డిసెంబర్ 17వ తేదీన అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అయితే అది ట్రంప్‌ని అధ్యక్షుడుగా ఎన్నుకోవడం లాంఛనప్రాయమే. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన్నట్లు అధికారికంగా ప్రకటిస్తారు.
ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వానికి అధికార బదలాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఇది పూర్తవడానికి కొంత సమయం పడుతుంది కనుక ఆనవాయితీ ప్రకారం జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేస్తారు.
ఓ వ్యక్తి అమెరికా అధ్యక్షుడుగా రెండుసార్లు మాత్రమే చేయగలరు. ట్రంప్ ఇదివరకే ఓసారి అధ్యక్షుడుగా చేశారు కనుక ఆయనకు ఇదే చివరిసారి. అయన ఈ పదవిలో 4 ఏళ్ళు కొనసాగుతారు.