అమెరికాలో తుపాకీ సంస్కృతి వలన తరచూ ఎక్కడో అక్కడ కాల్పులు జరిగి అమాయక ప్రజలు, చిన్నారులు చనిపోతూనే ఉంటారు. అయితే ఈసారి అధ్యక్ష ఎన్నికలలో కాల్పులు జరుగుతుండటం గమనిస్తే ఇది తుపాకీ సంస్కృతి ప్రభావమని అనుకోలేము.
ఈ ఎన్నికలలో డెమొక్రెటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. రెండు నెలల క్రితం ట్రంప్ పెన్సెల్వేనియా ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయనపై కాల్పులు జరుగగా తృటిలో తప్పించుకున్నారు. మళ్ళీ ఇటీవల ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా, ఓ వ్యక్తి ఫెన్సింగ్ చాటు నుంచి తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపేందుకు రాగా వెంటనే భద్రతా సిబ్బంది అతనిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా నిన్న అర్ధరాత్రి ఆరిజోనాలోని డెమొక్రటిక్ పార్టీ కార్యాలయంపై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. అర్ధరాత్రి సమయంలో పార్టీ కార్యాలయంలో ఎవరు లేనందున ప్రాణ నష్టం జరుగలేదు. అదే పగటిపూట కార్యాలయం కిటకిటలాడుతున్నప్పుడు కాల్పులు జరిపి ఉంటే చాలా మంది చనిపోయి ఉండేవారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఈ మూడు ఘటనలని కలిపి చూస్తే అమెరికా ఎన్నికలలో ఫ్యాక్షనిజం ఛాయలు కనిపిస్తున్నాయి. ఎన్నికలలో ప్రత్యర్ధులను హతమార్చి అడ్డుతొలగించుకునేందుకు, వారి మద్దతుదారులను భయపెట్టేందుకు చేసే ఇటువంటి ప్రయత్నాలు ఫ్యాక్షనిజమే కదా?