హిల్లరీ క్లింటన్ ని ఎవరు ఓడించారు?

November 14, 2016
img

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడి, చివరి నిమిషం వరకు రేసులో ముందున్న డెమొక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ న్ని ఎవరు ఓడించారు? అని ప్రశ్నిస్తే అదేం వెర్రి ప్రశ్న? అని అందరూ నవ్వకుండా ఉండలేరు. డోనాల్డ్ ట్రంప్ ఆమెని ఓడించారు కదా?అంటారు. కానీ ఆమె మాత్రం తనని ట్రంప్ ఓడించలేదని వేరే వ్యక్తి ఓడించడాని చెప్పుకొంటున్నారుట! అతనే ఎఫ్.బి.ఐ. డైరక్టర్ జేమ్స్ కోమి!

ఎన్నికల ప్రచార సమయంలో హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ ఈ-మెయిల్స్ వ్యవహారం గురించి ట్రంప్ చాలాసార్లు ప్రస్తావించారు. ఒకసారి వారిద్దరి మద్య జరిగిన ముఖాముఖి చర్చలలో ట్రంప్ ఇదే వ్యవహారం గురించి ప్రస్తావించి ఆమెని దెబ్బ తీయాలని ప్రయత్నించారు కూడా కానీ ట్రంప్ ఊహించని విధంగా ‘అవును నేను అలాగ చేయడం తప్పే’ అని ఆమె తన తప్పుని ఒప్పుకోవడంతో ట్రంప్ ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రం పనిచేయలేదు. కానీ ఎఫ్.బి.ఐ. డైరక్టర్ జేమ్స్ కోమి ప్రయోగించిన అదే అస్త్రంతో ఆమె విజయావకాశాలు తారుమారు చేశారు. ఎన్నికల ప్రక్రియ కీలకి దశకి చేరుకొన్నప్పుడు, ఆమె ప్రైవేట్ ఈ-మెయిల్స్ వ్యవహారంపై విచారణ చేపడుతున్నట్లు ప్రకటించడంతో ఆమె పట్ల దేశ ప్రజల అభిప్రాయంలో పెనుమార్పు వచ్చింది. ఆ తరువాత వాటిలో దేశభద్రతకి భంగం కలిగించేవి ఏవీ లేవని, ఒక 1,000 నకిలీ ఈ మెయిల్స్ కూడా కనుగొన్నామని జేమ్స్ కోమి ప్రకటించినప్పటికీ, అప్పటికే హిల్లరీ క్లింటన్ కి జరుగరాని నష్టం జరిగిపోయింది. అదే   డోనాల్డ్ ట్రంప్ విజయావకాశాలని పెంచింది. అందుకే తాను ట్రంప్ చేతిలో కాక జేమ్స్ కోమి చేతిలో ఓడిపోయానని క్లింటన్ తన సన్నిహితులతో చెప్పుకొంటునట్లు తెలుస్తోంది. అది నిజమే కదా! 

కానీ విచిత్రం ఏమిటంటే, డోనాల్డ్ ట్రంప్ నోటి దురుసుని, అహంభావాన్ని, దేశంలో స్థిరపడ్డ విదేశీయులు, మహిళల పట్ల, ప్రపంచ దేశాల పట్ల అనుచితంగా మాట్లాడిన మాటలు వంటి అన్ని లోపాలని చాలా ఉదారంగా క్షమించిన అమెరికన్ ప్రజలు హిల్లరీ చేసిన ఒకే ఒక్క తప్పు ప్రైవేట్ ఈ మెయిల్స్ ని క్షమించలేకపోవడం చాలా విచిత్రంగానే ఉంది. ట్రంప్ అధ్యక్షుడుగా ఎన్నుకొన్న తరువాత ఇప్పుడు ఆయనని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడం అంతకంటే విచిత్రంగా ఉంది. ఏమైనప్పటికీ, ఎన్నికలలో చాలా కీలకమైన సమయంలో ఈ-మెయిల్స్ వ్యవహారంపై ఎఫ్.బి.ఐ. దర్యాప్తు మొదలుపెట్టడం వెనుక పెద్ద రాజకీయకుట్ర ఉన్నట్లే కనిపిస్తోంది. కానీ బరాక్ ఒబామా నేతృత్వంలో డెమొక్రాట్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు దానిని సకాలంలో గుర్తించి అడ్డుకోలేకపోవడం కూడా విచిత్రంగానే ఉంది. 

Related Post