అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారం చేపట్టక మునుపే తను ఎన్నికల ప్రచార సమయంలో గట్టిగా వ్యతిరేకించిన ‘హెల్త్ కేర్’ అంశంపై వెనకడుగు వేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. బరాక్ ఒబామా ప్రభుత్వం అమలుచేస్తున్న హెల్త్ కేర్ విధానంలో చాలా లోపాలు ఉన్నాయని, కనుక తాను అధ్యక్షుడయితే వెంటనే దానిని రద్దు చేస్తానని డోనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలు పలికారు. కానీ దాని గురించి ఒబామా క్లాసు తీసుకొన్న తరువాత హెల్త్ కేర్ పధకానికి కొన్ని మార్పులు చేసి కొనసాగించడమో లేదా రద్దు చేయడమో చేస్తామని చెప్పారు. ఒబామాపై గౌరవంతోనే ఆయన చేసిన సూచనలని పరిగణనలోకి తీసుకొని పరిశీలించాలనుకొంటున్నట్లు ట్రంప్ చెప్పారు.
వాస్తవానికి ఒబామా ప్రభుత్వం అమలుచేస్తున్న హెల్త్ కేర్ పధకం వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని ప్రవాసభారతీయులతో సహా అమెరికన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే దానిని రద్దు చేస్తానని డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలలో గెలిచిన తరువాత ఇప్పుడు పునరాలోచన చేస్తానంటున్నారు. ట్రంప్ వేసిన మొదటి వెనకడుగు ఇక్కడితోనే ఆగుతుందా ఇంకా ఏవైనా హామీలపై కూడా వెనకడుగులు వేస్తారా చూడాలి.